Facebook Twitter
మగువా! చెయ్యి తెగువ! - శారదా అశోకవర్ధన్

మగువా! చెయ్యి తెగువ!


- శారదా అశోకవర్ధన్

 

పైశాచిక పడగవిప్పి నాట్యం చేస్తోంది

నాగరీకం పదం పాడుతూ తాళం వేస్తోంది

పురుషాధిక్యం సమాజం మీసాలు తిప్పి

ఎప్పుడూ ఆడదానిపై సవాలు చేస్తూనే వున్నది

స్త్ర్రీని ఒక నలుసుగానే కాలరాసి పారేస్తున్నది

ఎదురు తిరిగిన మగువను మగరాయుడు అంటూ

తూలనాడుతూన్నది, హేళన చేస్తున్నది

ఆడవాళ్లకి పిరికి పాలు పోస్తూ

ప్రతివ్రతాల కథలను సిరంజితో ఇంజక్షన్ చేస్తూ

స్త్రీని ఎదగనీయక పురుషుడు

అడ్డుగోడై నిలుస్తున్నాడు

ఆమె మీద పెత్తనం చెలాయిస్తున్నాడు

డిగ్రీలున్నా దండగ ఆమెకి - ఉద్యోగం చెయ్యాలంటే

పురుషుడి పర్మిషన్ కావాలి

ఉద్యోగాలున్నా దండగే - ఆ డబ్బు పురుషుడికే ఇవ్వాలి

అతడి ఇష్టప్రకారమే ఖర్చు పెట్టాలి!

మగువా! చెయ్యి తెగువ!

మహిళా దినోత్సవాలలో తద్దినం పెట్టించుకున్నట్టు

వేదికలనెక్కి ఉపన్యాసాలివ్వడం కాదు

ఏడుపు కథలు వినిపించడం కాదు

ఈర్ష్యాసూయలు మాని

ద్వేషాగ్ని జ్వాలలకు దూరమై

మూడు కొప్పులు కలవవన్న నానుడిని తుడిచేస్తూ

మహా ప్రభంజనమై విజృంభించాలి

నవనారీ ప్రభాత గీతం ఎలుగెత్తి పాడాలి

నువ్వు కేవలం ఒక్క ఆడదానివే కాదు

మరొక పురుషుడికి జన్మనిచ్చే ప్రాణదాతవి కూడా!