Facebook Twitter
నాగదికి రెండు కిటికీలు - శారదా అశోకవర్ధన్

నా గదికి రెండు కిటికీలు


- శారదా అశోకవర్ధన్

 

నా గదికి రెండు కిటికీలున్నాయి - నా కళ్లలాగే

నా కళ్ళు రెండు ఎప్పుడూ తెరిచే వుంటాయి. ఒక్క నిద్రలో తప్ప

ఈ ప్రపంచంలోని వింతలన్నీ చూస్తూనే వుంటాయి

కోరికలు నింపుకుంటూ వుంటాయి

కానీ నా గదికిటికీలు మాత్రం

రెండూ ఒక్కసారే ఎప్పుడూ తెరుచుకోలేదు

ఓ కిటికీ గుండా

ఎన్నెన్నో దృశ్యలో!

ఆరంతస్తులనుంచి పదహారంతస్తుల వరకు

గగనానికి నిచ్చెనలు వేసినట్టు

మిలమిలా మెరిసిపోయే ఇంద్రభవనాలు

వెన్నెల రాత్రుల్లో తాజ్ మహల్ ని తలదన్నేలా

వంద చందమామల వెలుగును పులుముకున్నట్టు మెరిసిపోతాయి

దివి నుండి తారకలు దిగివచ్చినట్లు

విద్యుత్ దీపాలు వెలిగిపోతాయి

పండగే రానఖ్కర్లేదక్కడ

ప్రతీరోజు సందడే

పడవల్లాంటి పొడవాటి కార్లూ

దేవకన్యల్లా అలంకరించుకునే పడతులూ

నవనాగరికతను ప్రతీకలైన యువకులూ

భూతల స్వర్గం ఆ దృశ్యం

అక్కడి దృశ్యాన్ని ప్రసరిస్తుంది ఆ కిటికీ నా గదికి

మదినిండా నింపుతుంది ఆనందం నా మదికి

మరో కిటికీ తెరిస్తే కనిపించే దృశ్యం

బతుకుకీ మెతుకుకీ మధ్య జరిగే పోరాటం

పొద్దు పొడిచినప్పటినుంచి పొద్దుకుంగేదాకా

కాలంతో గడిపే సమరం

బాధలని మరచిపోవడానికి తాగేవాడొకడు

బడాయిలు వారికి తెలీవు

బుకాయింపులు అసలే లేవు

పేలికలు చుట్టుకున్నా నవ్వులు

రేపటి ఆశల పువ్వులు

తియ్యని కోరికతో చందమామ వెలుగులో

నులకమంచం ఉయ్యాల్లో

ఊహల్లో తేలిపోయే జనం

పాలమనసులు వారివి

దీపాల్లాంటి స్వచ్చమైన బతుకులు వాళ్లవి

పసిపాపల్లా దేనికో కొట్టుకుంటారు

అంతలోనే కలుసుకుంటారు

కమ్మగా పాడుకుంటారు

ఆడుకుంటారు

అక్కడ స్వచ్చమైన నూనెదీపాలు తప్ప

మెర్కురీ బల్బులు కనిపించవు

అందుకే ఆ కిటికీలోంచి ఏదీ

ప్రసరించదు నాగదికి

నా రెండు కిటికీలలో ఎంత తేడా

ఒకటి స్వచ్చతకు రూపమైతే

మరొకటి కృత్రిమానికి ప్రతిరూపం

అయినా నాకెందుకంత స్వార్ధం?

విద్యుత్ కాంతులను నా గదిగుండా

అవతలి కిటికీలోంచి నేనైనా

ప్రసరింప చెయ్యచ్చుగా!

స్వార్ధం ఈనాడు మన జన్మహక్కై నడిపిస్తోంది.

పెదవి విడిపడదు పలుకు రాదు - నా గది కిటికీల్లాగే