Facebook Twitter
నీబాట నువ్వే వేసుకో - శారదా అశోకవర్ధన్

నీబాట నువ్వే వేసుకో


- శారదా అశోకవర్ధన్

 

నా చిట్టి తల్లీ! నా గారాలవల్లీ!

పదేళ్లయినా నిండని నిన్ను

బయటి ప్రపంచం దృష్టిలో పడకుండా

సృష్టిలోని అందాలను తనివితీరా చూడనీయకుండా

నీ బాల్యాన్ని ఉండచుట్టి పడేసి

నిన్ను గాంధారిని చేసి కూర్చోబెట్టే

దౌర్భాగ్యపు స్థితిని ఏమనాలో తెలీదు

ఏ పేరు పెట్టి పిలవాలో తెలీదు

బడికి పంపిస్తే పదేళ్ల పాపని

పదిలంగా తిరిగొస్తావన్న నమ్మకంలేదు

గుడికెళ్లినా అంతే

దేముడూరాయే కదా!

పొలంకెళితే నవ్వుతూ తిరిగొస్తావన్న ఆశలేదు

శవంగా మారిపోవచ్చు!

పూలు కొనడానికెళితే నవ్వేపువ్వులా వున్న నిన్ను

ఏ పాపిష్టి చేతులో ఎత్తుకుపోయి నలిపిపారెయ్యొచ్చు

ఇంటికొచ్చిన బంధువే రాబందుగా మారి

కబళించుకు పోవచ్చు

నిర్దాక్షిణ్యంగా చచ్చిన చేపలనో కోడి పెట్టలనో

రాళ్లనో రప్పలనో రవాణా చేసినట్టు

ఎక్కడికైనా నిన్ను అమ్మెయ్యొచ్చు

ఎక్కడని దాచి పెట్టను తల్లీ నిన్ను

ఎన్నాళ్లని నా చీరకుచ్చెళ్లలో చుట్టి

నిన్ను దాచగలను?

ఇంతటి విశాల ప్రపంచంలో నీకు

స్వేచ్ఛగా తిరిగే చోటే కరువయిందా

బతుకే బరువైందా?

బాధపడకు తల్లీ,

నా గారాలవల్లీ

ఏడుస్తూ కూర్చోకు ఖర్మ అని

నీ జోలికి వచ్చిన వాళ్ళని

జాలిపడిక కొరికి పారేయ్

కుత్తుకలు కోసిపారెయ్

మనిషికన్న బండరాయినో

ఇనుపసుత్తినో నమ్ముకో

అమ్మగా నిన్నెప్పుడూ ఒకకంట

కనిపెడుతూనే వుంటాను

నీడలా నీ వెంటే వుంటాను!