Facebook Twitter
చెత్తకుండీ గుండె పగిలిన వేళ - శారదా అశోకవర్ధన్

చెత్తకుండీ గుండె పగిలిన వేళ


- శారదా అశోకవర్ధన్

 

టపటప మని మబ్బుల పేగులు తెంచుకుని

గాలి తాకిడికి రాలిన నీటి చుక్కలని చూసి

రాని నిద్దురకోసం అలసటతో అల్లాడే పావని

జోకొడితే బజ్జుంటుందేమోనన్న అమ్మ ఆశలా

పుడమితల్లి పులకరిస్తూ ఒళ్ళు విరుచుకుని కళ్ళు పెద్దవి చేసి చూసింది

పసిపాప బోసినవ్వులాగే హాయిగా నవ్వుకుంది!

సబ్బు నురగల్లోంచి విరిస్తే సుగంధ పరిమళంలా

నీటి చుక్కతో తడిసి మట్టి చిమ్ముతున్న ఆ వాసనకి

తన్మయత్వంతో నేల నింగికొచ్చేసింది మురిసిపోయింది!

అంతలోనే ముక్కుపుటాలదిరిపోయేటట్టు విస్తరించిపోయింది

క్షీరసాగరమధనంలో ముందుగా వీచిన విషవాయువుల్లా

అల్లుకుపోయింది

పక్కనే రోడ్డునిండా పడున్న చెత్తకుండీలోంచి

అలలు అలలుగా అగిసిపడుతున్న దుర్వాసన

తల తిరిగిపోయేలా కడుపులోకి దూసుకుపోతున్న గబ్బువాసన

చెత్తకుండీ ఆకారం సగం పగిలి

తరుగుతూన్న చందమామ విరిగిన ముక్కలా వికృతంగా

కనిపిస్తూన్నట్టుంది

క్రితంరాత్రి ఎవరో ప్రముఖులకు స్వాగతం పలకడానికి

ఉపయోగించుకుని తరువాత తన్ని తగలేస్తే దొర్లుకుంటూ

పోయి ఫ్రాక్చరయి పడున్న వ్యక్తిలా వుంది

అల్లంత దూరాన చెత్తకుండీ -

ఎప్పటినుంచో అక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తా చెదారం

తమనట్లా రోడ్డు మీదకు విసిరిపారేసి, తప్పంతా తమదే అయినట్టు

ఇప్పుడు అసహ్యించుకుంటూన్న పెద్దమనుషుల ప్రవర్తన చూసి

ఆవేదనతో అలమటించిపోతూ

కుళ్లి కుళ్లి ఏడ్చాయి

పాత రోజులు గుర్తుకొచ్చి కళ్ళు చమర్చాయి

కొత్త లారీలలో తమని మోసుకుపోయే వారు

ఊరిచివర ఆరుబయట అతి జాగ్రత్తగా చేరవేసేవారు

ధూళితో ఆడుతూ గాలితో పాడుతూ

దినకరుని వెచ్చని ఒడిలో హాయిగా తేలుతూ

చక్కని ఎరువుగా మారి పచ్చని చెట్లకి తోడ్పడేవారం

మేము సైతం మంచి పనికి ఉపయోగపడుతున్నామని

తృప్తి పడేవాళ్లం

ఆరోజుల మోజులు గాధలుగా మారిపోయాయి

బాధలు మాత్రం మిగిలిపోయాయి

ఇప్పుడు మాతో వుండేది చెత్తా చెదారం మాత్రమే కాదు

ఘోర భయంకర పాపభూయిష్టమైన పైశాచిక శక్తి ఆవరించుకున్న

కాముకుల రహస్య కామకేళీ కృత్యానికి బలిపోయిన పసికందు -

కట్నపిశాచికి ఝడిసి ఆడపిల్ల అని తెలియగానే

భ్రూణహత్యకు పాల్పడే పాపాత్ముల ఘాతుకానికి

ప్రాణాలు పొగొట్టుకున్న చిట్టితల్లి మాంసపు ముద్ద

తిన్నదీ తాగిందీ ఇమడక ఒక బీరుదాసు ఒక బ్రాందీనాధుడు

ఒక విస్కీరాజు కక్కిన వాంతుల దిబ్బలు

చిచ్చు పెట్టినా తగలబడని

భ్రష్టుపట్టిన రొచ్చు!

మమ్మల్ని పట్టించుకునే నాధులు లేరు

ఎండకి ఎండుతూ వానకి నానుతూ

అందరిచేతా తిట్లూ చీత్కారాలూ అందుకుంటూ

కన్నీరు మున్నీరుగా రోదిస్తున్న

మాది అరణ్యరోదనే!

మమ్మల్ని భరించేదీ ఒళ్లో ఓపిగ్గా దాచుకునేదీ

పుడమితల్లి ఒక్కర్తే -

కనీసం వరుణుడు కరుణిస్తే

గోతులు పడ్డ రోడ్లనిండా నీరునిండుకున్నపుడు

మేమూ ఆ వరదలో కొట్టుకుపోయి తలా చోట పడితే

గాలిపుణ్యమా అని జోరుగా వీచితే దూరంగా విసరబడితే

ఎక్కడో అక్కడ గడిపేసి

ధూళిలో కలిసిపోతామా అని మా పోరాటం

నేల తల్లి ఆరాటం!

ఏం పాపమో ఎవరి శాపమో

వానలూ కురవడం లేదు

ఆకాశ హర్మ్యాల్లాంటి భవనాలు వెలిశాక

గాలివీచడం లేదు -

పెళ్ళికాని ఆడపిల్లల తల్లి కలల్లాగా

పుడమితల్లి కోరికలూ కరిగిపోతున్నాయి

గుండె పగిలి బీటలుబారిన పగుళ్లలోంచి వెలువడే

వేడి నిట్టూర్పుల బాధలను

చెప్పకుందామంటే చెట్లూ చేమలూ కూడా ఎక్కడా లేవు

కొండలూ బండలూ కూడా దరిదాపుల్లో లేవు

గుట్టలు గుట్టలుగా పెరిగిపోయిన చెత్తలాగా

గుంపులు, గుంపులుగా పెరిగిపోయిన జనాభా తప్ప -

ఒంటరిగా పుడమితల్లి రోదిస్తోంది

చెత్తకుండీని ఓదారుస్తూ

తరతరాలుగా రకరకాల బాధలననుభవించే

తరుణిలాగా ధరణికూడా రోదిస్తోంది

చెత్తను మొయ్యలేక కాదు

చెత్తను చీదరించుకుంటూ

చెత్త మనస్తత్వాన్ని పెంచుకునే

చెత్త మనుషుల గురించి

ఒంటరిగా పుడమితల్లి రోదిస్తోంది!