మనిషికోసం మాట్లాడుదాం!
.jpg)
మనిషితనం, మరుగుజ్జు అవుతున్న సంధికాలంలో
మనం ఒక్కక్షణం మనిషి కోసం మాట్లాడుదాం!
కన్నబిడ్డల్నే కడతేర్చే అడవి నీతి నిత్యకృత్యమై,
పరంపరై దినపత్రికల్లోకంపై మంచితనాన్నే
మాలిన్యంచేస్తున్న దౌర్భాగ్యపు సందర్భానా...
మసకబారుతున్న మనిషికోసం మళ్ళీమళ్ళీ మాట్లాడుదాం!
అమ్మకడుపున ఉమ్మనీటి స్వేచ్ఛ విహంగాన్నీ
ఆధునికత మాటున నీడను పసిగట్టి
పైత్యరసం తలకెక్కి పసిపిందెల్ని చిదిమేస్తున్న
పనికిమాలిన మనిషికోసం పదేపదే మాట్లాడుదాం!
పారాణి ఆరని పచ్చటి పందిరి ఇంట నవ వధువు
మృత్యుఘోషలో విగతజీవి అయితే
చావు బాజా గేలినృత్యపు వికటాట్టహాసాన్ని ఆనందించే
కట్నపిశాచాలు ఆవరించిన
రక్తపిపాసుల కోసం రచ్చరచ్చగా మాట్లాడుదాం!
కనురెప్పేకనుపాపనుకాటేస్తున్న వికృతచేష్టలతో
విలువల వలువలూడదీస్తూ నడిబజారున
దుశ్యాసన పర్వాల్ని సాగిస్తున్న
కీచక వంశాంకురాలకోసం నిస్సిగ్గుగానైన మాట్లాడుదాం!
గోముఖ వ్యాఘ్రాలు మత కుబుసపు పడగనీడన అదును చూసి కాటేసి
పారేనెత్తుటి వరదల్లో నిలువెల్లా స్నానమాడుతూ
పైశాచికానందాన్ని పదేపదే కాక్షించే ప్రేతాత్మలు ఆవరించిన
రాక్షస మనిషికోసం గొంతెత్తి మాట్లాడుదాం!
మనం ఒక్కసారి ''మనీషి''కోసం కూడా మాట్లాడుదాం!
జననమరణ మధ్యకాలమంతా మనాదంతా మనిషే కేంద్రీకృతమై
రేపటివెలుగుకోసం, వెన్నెలకోసం, మనిషికోసం మహోన్నత స్వప్నంకోసం
బంధాల్ని, బంధనాల్ని ప్రేమ మమకారాల్ని చివరకు దేహాన్ని ప్రాణాన్ని
తృణప్రాయమంటున్న ఆ మహోన్నత
'మనిషి' కోసం తప్పకుండ మాట్లాడుదాం!
మాట్లాడుతూ మాట్లాడుతూ మృగానికి మనిషికీ
మధ్య తేడాను వ్యవస్తీకృతం చేద్దాం!
......వెంకటేష్ వలన్‌దాస్
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో



