Facebook Twitter
ఇదెక్కడి న్యాయం?

 ఇదెక్కడి న్యాయం?

 

      

-కనకదుర్గ-

మహాకవీ! శ్రీ శ్రీ !
మీ జయంతులు,
వర్ధంతులు గుర్తు పెట్టుకుని
మరీ చేసుకుంటున్నాము.
ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో
ఏం చేయాలో తెలియక
కొట్టుమిట్టాడుతున్న వారు
మీలాంటి మహాకవులు మళ్ళీ
పుట్టాలంటారు,
మీరు జీవితకాలం
మార్పు కోసం పోరాటం జరిపిన
వారే కదా!
మీరు రాసిన కవితా సంకలనాలు,
మాకోసం ఇచ్చిన గొప్ప
ఆయుధాలు,
మీ జీవితం ప్రేరణతో,
 ఈ ఆయుధాలతో
నేటి యువతరం
మార్పు కోసం
ముందుకు దూకలేదా?
సోంబేరి బ్రతుకులకు
స్వస్తి చెప్పి పోరాటం
చేయలేదా?
చదువు చెప్పే ఫ్యాక్టరీలలో
తయారయిన గ్రాడ్యుయేట్లు
పెద్ద కార్పోరేట్ వుద్యోగాలో,
విదేశాలలో సెటిల్ కావడానికో
తహ తహ లాడే వారికి,
కల్సి కట్టుగా వుండి
సమస్యల్ని ఎదిరించి
ధైర్యంగా పోరాడడం
చేతగాక,
అప్పుడు పోరాటం జరిపిన
నాయకులు, రచయితలు,
మీ లాంటి కవులు,
మళ్ళీ పుడితే కానీ
ఏ మార్పు సాధ్యం కాదని
వాపోతుంటారు.
తను, తన చదువు, వుద్యోగం,
పెళ్ళి, సంసారం,
జీవితంలో పేరు ప్రతిష్టలు
సంపాదించడం,
పక్కవారికన్నా మన దగ్గర
అన్నీ ఎక్కువ వుండాలి
అనే తత్వం వున్న వారికి,
మీ కవిత్వం వారి
ఆలోచనావిధానాన్ని
మార్చే చర్నాకోలా
కావాలి,
ప్రేరణ, స్ఫూర్తి
కావాలి,
మీరు చూపించిన బాటలో
నడవడానికి నడుం కట్టాలి
అంతే కానీ మళ్ళీ మిమ్మల్ని
పుట్టమనడం ఇదెక్కడి
న్యాయం!