Facebook Twitter
చేదుకొండ

చేదుకొండ

సి.భవానీ


గతం ఇంత బరువా?
ఎప్పటి కష్టనష్టాల కుప్ప ఇది?
ఆ జ్ఞాపకం బండరాయై
గుదిబండ కొండగా
నా వీపుమీంచి దిగటంలేదు చూడు?

చేదుకొండను మోయటం
ఎవరికీ మాత్రం ఇష్టం ?
ములైయినా రాయైనా తీసేయాల్సిందే !

గాయాలు కన్నీళ్లు
గతం దించిన గుణపాలే కదా!
కాల గమనంలో ఇంకా ఇంకా
లోతుగా పాతుకుపోతుంటే పెకలించటమెలా?

నా గమ్యం ఆ శిఖరమైనపుడు
ఇంత బరువును మోసుకుంటూ చేరేదెలా?
కొండ అందాలు చూడాలంటే లోయలోంచే
లోయలోకి దిగితే కొండ ఆకాశమే!

ఏమైనా సరే ఆ కొండెక్కాలి
ఉదయించే సూర్యున్ని మొదటగా నేనే చూడాలి
కొత్త వెలుగుని కళ్ళనిండా శ్వాసించాలి

విషాద కఠినాత్ములు కత్తిరించిన
నా బలహీనపు రెక్కల్ని విదిలించుకొని
సరికొత్త బలంతో నింగికెగరాలి

నాకు నేనే మోపుకున్న
నన్ను లాగేస్తున్న ఈ బరువును
దింపుకోవటానికి దిక్కుల కెదగాలి.