Facebook Twitter
చివరి పేజి

చివరి పేజి

- డా.సి.భవానీదేవి 


రహస్యమైన నిశబ్ద రాత్రి
చీకటి దీపం వెలుగులో
బతుకు పేజీల రెపరెపలు
ఒక్కొక్క మడతలోంచి
మల్లెపూల మంటలు

ఇంతకాలంగా రాస్తున్న కలం
శూన్యం ముట్టడిలో చిక్కుకుని
స్తబ్దంగా ఆగిపోయింది
రాసుకున్న పేజీల్లోంచి
నెమలీకలన్ని ఒక్కసారిగా కళ్ళు తెరిచాయి
ఆత్మీయంగా కలాన్ని పెనవేసుకున్నాయి
మా గురించి మర్చిపోయావా?
విచలిత కంఠంతో ప్రశ్నించాయి

కలం ఉలిక్కిపడింది
ఆత్మీయ బలంతో నిటారుగా నిలబడింది
మళ్ళీ నడక ప్రారంభించింది
ఇప్పుడు కలం కళ్ళల్లో కలలు
పింఛాలు విప్పుతున్నాయి
చివరి పేజీకేసి నడుస్తూ నేను