Facebook Twitter
శాపం

శాపం

                                                                                                                            - శారద అశోకవర్ధన్

ఎంత ' ఉక్కు' అయినా
    మంటల్లో మాడిస్తే
    నీరులా జారిపోతుంది!

    ఎంత రాతి బండనైనా
    సుత్తితో బాదితే
    చిత్తుగా పగిలి
    ముక్కులు ముక్కలవుతుంది !

    ఎంత ఉదృతమైన నదీనదాలు
    మానవుడి తెలివి తేటలకు లొంగి
    ఆనకట్టలకు ఆగుతున్నాయి!

    ఎంతటి భయంకరం కౄర మృగాలవైన
    మనిషి మచ్చికతో చేరదీసి
    చతురతో లొంగదీసుకుంటున్నాడు!

    కడలిలో ఈది భూగర్భ శాస్త్రాన్నీ
    అంతరిక్షంలో ఎగిరి ఊర్ద్వలోకాలనీ గాంచి
    మనిషి సాధించలేనిదేదీ లేదంటూ
    దండోరా వేయిస్తున్నాడు.
    భుజాలు చరుచుకుంటున్నాడు.

    కానీ

    మనిషి మనిషితోనే చిత్తుగా
    ఓడిపోతున్నాడు

    యుగ యుగాలుగా పాతుకుపోయి
    కరుడు గట్టిన మూర్ఖత్వాన్ని
    కరిగించలేక పోతున్నాడు

    మారేకాలంతో మారుతున్న విలువలతో
    మారలేక
    జీవితంతో కుస్తీ పడుతూన్న తోటి
    మానవులను మార్చలేకపోతున్నాడు.

    స్వార్ధమే ఊపిరిగా జీవించే రక్కసులను
    జయించి వారి ఆటకట్టించలేక పోతున్నాడు.

    నల్లజారు నడివిధుల్లో నాగరికంగా
    చలామణీ అయ్యే
    గోముఖ వ్యాఘ్రాలను లొంగదీసుకోలేక పోతున్నాడు

    సారామత్తులో చిత్తుగా మునిగి
    సుఖాల బురఖా కప్పుకుని
    పైలా పచ్చీసుగా తిరుగుతూ
    పడతుల శీలాలను బలిగొనే
    రావణాసురుల నాపలేకపోతున్నాడు.

    కులాల పేరిట కుత్తుకలు కోసుకునే
    కుళ్ళు సమాజానికి కళ్ళు తెరపలేక పోతున్నాడు.

    మతంపేరిట జరిగే హొమపు
    మంటలనాపలేక పోతున్నాడు.

    పదనీ వ్యామోహాల మురికి గుంటల్లోపడి
    బంధావ్యాలను సయితం బలిచేస్తూ
    నైతిక విలువలను నట్టేట ముంచుతూన్న జనానికి
    బుద్ధి చెప్పలేక పోతున్నాడు.

    " నితీ భీతీ న్యాయం ధర్మం'
    అనే పదాలు వింటేనే పగలబడి నవ్వి
    జాతి ఔన్నత్యాన్ని నట్టేట ముంచుతూన్న
    దౌర్భాగ్యుల కీళ్ళు విరవలేక పోతున్నాడు

    ఎన్ని సాదిస్తేనేం?
    మనిషి మనిషితోనే ఓడిపోతున్నాడు
    మనిషి మనిషిగా బతకలేకపోతున్నాడు
    రచ్చగెలిగి ఇంట ఓడిపోయినట్టు
    మనిషి పెట్టిన అడ్డుగోడలను
    మనిషే కూలగోట్టలేక పోతున్నాడు.

    అదే నేటి మనిషి ఖర్మం!
    మనుగడకి శాపం!