Facebook Twitter
ఓ కలమా' కాపాడు నన్ను

 ఓ కలమా' కాపాడు నన్ను

-శారద అశోకవర్ధన్

ఎందుకో నాకీ వ్యథ?

    అంతులేని ఈ జీవన యానంలో
    నేను సయితం ఒక సమిధనే కదా!

    అతనిపై జరుగుతూన్న అన్యాయాలను చూసి
    అవకతవకలను గాంచి
    ఆగిపోతుందేమో గుండె అన్నంత ఆవేదన !

    ఆపలేని అనర్ధాల అగ్నిగుండాల అన్నంత చూసి అప్పుడే
    పగిలి పోతుందేమో గుండె అన్నంత ఆందోళన!

    ఒక పక్క పగలంతా రెక్కలు ముక్కలయ్యేలా
    పనీ పాటా చేసుకుంటూ
    మధ్యాహ్నపు మార్తాండు డి తీవ్రత తప్ప
    సాయం సంధ్య సోగాసుల్నీ సముద్రపు హొరుల్నీ
    కనీసం విననైనా నోచలేని సామాన్య సోదరుడు

    కడుపులో ఆకలికి కర్రుమనే పేగుల చప్పుళ్ళే సంగీతంగా
    కష్టాల దొంతరులే నిత్యపారాయణంగా
    కుటుంబాన్ని సాకలేని నికృష్టపు జీవితాన్ని గురించి
    కుళ్ళి కుళ్ళి ఏడుస్తూంటే

    మరోపక్క తిన్నదగరక తికమకలు పడుకుంటూ
    అరగడానికి అందంగా మదులను మింగుకుంటూ
    కులాసాల విలాసాల పందిల్లో సంతర్పణలు జరుపుకుంటూ
    పీకల నిండా సారానింపి
    పేకాటల సరదాల సల్లాపాల్లో తేలియాడుతూ
    కాలుకింద పెట్టకుండా కారులోనే కలాపాలు సాగించే
    కల్తీ నాగరీకులను చూస్తూ వుంటే

    కడుపు తరుక్కుపోయే ఆవేదన
    అర్ధంలేని అవ్యక్తమైన అందోళన!

    ఎందుకో నాకీ వ్యధ?
    అంతులేని ఈ జీవన యానంలో
    నేను సయితం ఒక సమిధనే కద!
   
    చదువు పేరు చెప్పుకుంటూ చదివే ఓపికలేక
    షార్టు కట్టున ప్యాసవ్యాలనే కొందరు విద్యార్ధులూ
    పని చెయ్యకపోయినా ప్రమోషన్ల లిస్టులో
    ప్రధముడిగా వుండాలని తహతహలాడే కొందరు ఉద్యోగులూ
    బాధ్యతలను విస్మరించి హక్కుల కోసమే
    పోరాడే కొందరు యువకులను చూస్తుంటే
    మనస్సు విల విల లాడుతుంది
    మదిలో విషాదం అలుముకుంటుంది.

    ఇదే రేపటి నా తరం
    గగుర్పొడుస్తుంది నరనరం.

    కట్నాలు చలవనీ అత్తవారిని తిట్టిపోస్తూ
    కట్టుకున్న భార్యని అడుగడుగునా దెప్పి పొడుస్తూ
    కసితీరక కాల్చి అడుగడుగునా దెప్పి పొడుస్తూ
    కసితీరక కాల్చి చంపి, మరోదాన్ని కట్టుకుని
    మగధిరుల చూస్తు వుంటే

    గుండె నిండా చీకటి నిండిపోతుంది
    గుబులుతో మనసు మాడిపోతుంది
    ఇదే రేపటి నా తరం
    గగుర్పొడుస్తుంది నరనరం!

    పదవి కోసం పరువును తాకట్టు బెట్టి
    విలువలను నడివీధిలో నగ్నంగా వేలంవేసి
    స్వార్ధాన్ని వలువలుగా చుట్టుకుని పెత్తనంచేసే
    నాయకుల నడుమ నడుస్తుంటే

    నాడు ' వందేమాతరం' నినాదాలతో

ప్రజలను ఉత్తేజపరచి
    నిస్వార్ధంగా దేశంకోసం వారు చేసిన నాటి

త్యాగాలను మనం చేసుకుని

    కొన ఊపిరికి ఊహలు నిండి
    మధనపడే త్యాగధనులు
    ఈనాడు ఇంకా ఎందుకు బతుకున్నామా అని
    నిలువునా కుప్ప కూలిపోతూంటే

    మనసు వేదనతో మంది పోతుంది
    గుండె దుఃఖంతో బద్దలై పోతుంది
    అవకతవకలను నేను సరిద్దిలేనపుడు

    సమానత్వం ' సౌభ్రాతృత్వం ' అంటూ
    ఉపన్యాసాలిచ్చి ఆత్మ వంచన చేసుకోలేను

    గేయాలురాసి రాగాలు కట్టి ఆనందించలేదు
    అయినా పిరికిని కాను నేను
    నిరాశా వాదిని అసలేకాను
    అందుకనే అర్ధిస్తున్నాను నా కలాన్ని
    ' ఓ కలమా కాపాడు నన్ను' అంటూ
    నా ప్రజలను ఉత్తేజపరచే రచనలే సాగించమని!

    నా ప్రజలను స్వార్ధపు పొరలనుండి విము క్తిచేసే

వినూత్న రచనలు రచించమని!

    ఈ మహాయానంలో జీవనసమరంలో
    ఏ ఒక్కరు మారినా చాలు అతడే
    రేపటి నా తరాన్ని ప్రభావితం చేసే ప్రభాకరుడు
    అందుకే నాకీవ్యథ!

    అంతులేని ఈ జీవన యానంలో
    నేను సయితం ఒక సమిధిగా కలిపోలేను!

    రేపటి వెలుగుకోసం ఎదురు చూస్తూ వుంటాను!