మనిషిగా బ్రతకడం
-శారద అశోకవర్ధన్
.png)
మనిషీ! మనిషిగా బ్రతకడం నేర్చుకో
దుర్గుణాల మలినాలను దూరంగా ఒదిలేసి
మంచిని పెంచు మార్గాలను
అనుసరించడం అలవరుచుకో.
జీవితం ఒక గులాబీ
ఆహ్లాదాన్నిస్తుంది
గులాబీల సౌందర్యం
అందాన్నిస్తుంది
జీవితపు సౌరభ్యం.
రెక్కలు రాలిపోతే
అంధవికార మౌతుంది గులాబి
క్రమశిక్షణ లేకపోతే
అర్ధవిహీన మౌతుంది జీవితం.
అందంగా కనిపించే గులాబీకి
ఎన్నో ముళ్ళు!!
తియ్యగా కనిపించే జీవితం వెనకాల
ఎన్నెన్నో చీకట్లు!!
ముళ్ళు గుచ్చుకోకుండా గులాబీలు కోసుకోవాలి
చీకట్లు చిమ్మకుండా
జీవితాన్ని దిద్దుకోవాలి
అందుకు.
నేర్పూ ఓర్పూ కావాలి
మంచీ చెడూ తెలియాలి
అప్పుడే మనిషిగా మనగలుతావు.
మనిషిలోని కలుషితాన్ని
మంచితనంతో కడిగేసి
అద్దంలోని ప్రతిబింబంలా
నిన్ను నీవు చూచుకో
అప్పుడే మనిషిగా మనగలుగుతావు.
అహంకారపు పొరలు
కనుల కడ్డంగా నిలిచినప్పుడు
మెదడు నువయోగించి
పొరలు తొలగించి
కనుపాపల్లో దాగివున్న సత్యాన్ని చూడు
అప్పుడే మనిషిగా మనగలుగుతావు
పదవీ వ్యామోహంలో
పలుకుబడి కౌగిట్లో
నిన్ను నీవు మరిస్తే
కాలమనే చక్రంలో
అది క్షణికమని తెలుసుకో
వీదారిని మలుపుకో
అప్పుడే మనిషిగా మనగలుగుతావు.
మనిషిగా పుట్టిన నీవు
మానవత్వాన్ని విడచే
దానపుడిలా, దారుణంగా
జీవించడం కన్న
హంసలా, ఆరునెల్లు చాలు మనిషీ
మనిషీగా బ్రతకడం నేర్చుకో



