తపస్విని
శ్రీమతి శారద అశోకవర్ధన్

ఎన్నో పవలు! ఎన్నెన్నో రేలు
నీ కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని
ఎదురుచూసి నిదురకాస్తే
నీవేతెంచిన మరుక్షణం
కన్ను కుట్టిన నిద్రాదేవి
వడివడిగా ఒక్క తృటిలో
కసితీరా ఆవరించి
నిన్ను నన్నూ వేరు చేసెను!
ఘనకార్యం సాధించినట్టు
వేణు వెంటనే మాయమాయెను!
గుండెలోని ఊసులెన్నో
గొంతుదాటి వెలికిరాక
కళ్ళలోని కధలన్నీ
కరిగిపోయి చెదిరిపోగా
తెలుపలేని మూగమనసు
గుట్టుగా గుసగుసలు పలికెను.
ఏమని?
సొగకన్నుల నీ చేలికానికి
ఆ వెన్నెల రేడు సయితం
ఎన్నటికి సరికాడని
ఎలాగా?
పులకరించింది వయసు!
అబ్బురంగా అడిగింది మనసు!
దొంగ చాటుగా మబ్బుల మాటున
తార తారతో సరసాలడును ఆరేడు
గుండె దిటవుతో పొంగు వలపుతో
నిన్ను తప్ప వేరెవ్వరినీ చేరడు నీ జతగాడు!
ఇద్దరి మధ్యన పోలిక ఎక్కడ?
నీ ప్రియుడికి నీ వంటేనే మక్కువ!
పగలంతా పలుదారులు తొక్కుతూ
రాతిరి మాత్రం నింగిని నిక్కిన
కలువలరేడు కడు గడసరి వాడు
రేయీ పవలు తేడా తెలియక
పాలూ నీరుగ నీతో కలసిన- కడు
ప్రేమధనుడు నిను వలచిన వాడు!
నెలకొకసారే ఘనముగ వెలిగి
తక్కిన రోజులు తప్పుకు తిరిగే
పిరికివాడు ఆ వెన్నెల రేడు
నిత్యము నీతో నీడగ నిలిచి-ప్రతి
నిముషము నీతోడుగ నడిచే-రస
హృదిగల రమణుడు నీవాడు!
ఇద్దరి మధ్యన పోలిక ఎక్కడ?
నీ ప్రియుడికి నీవంటేనే మక్కువ!
మూగ మనసు మాటలు విని
ఊరడిల్లింది హృదయం
పరవశించింది ప్రతి క్షణం!
ఊగిపోయింది మేను-ఉయ్యాలగా
సాగిపోయింది ప్రేమ జంపాలగా!
మనసు మీటింది మది వీణచేసి
కళ్యాణ రాగం!
విందుచేసి మురిసింది మమతల
పందిరేసి వయసు వింత సోయగం!'
అనిపించింది నాకు ఆ క్షణం
నాకు మాత్రం ఏమి తక్కువ
గుండె నిండా ఎంత మక్కువ
నాకోసం ఎన్నికళ్ళో కలల తేలుతూ
తూలుతూంటే
వలలు పన్ని వగస్తూంటే
నా అడుగులో అడుగులేసి
నాట్యమని పులకరిస్తే?
నా మాటతో మాట కలిపి అది
గీతమని భ్రమిస్తూంటే
నా నిట్టూర్పుల సెగలు పీల్చి
చలువ వెన్నెల వెల్లువలని మురుస్తూంటే
నా చుట్టూ గిరిగీసుకు కూర్చున్నా
అపర శారద అవతారమని
అభివర్ణించి ఆనందిస్తూంటే?
మౌనిలాగా మెల్లగా
నవ్వుతోంది నా మనస్సు
నా ప్రియుని ప్రేమానురాగాల
వర ప్రసాదంకోసం చేస్తోంది తపస్సు!
అందుకు,
వేయి వరుణులు ఒక్కసారి వర్ణించినా
లక్ష పవనాలు ఒక్కసారి ప్రభంజించినా
కోటి మేఘాలు చుట్టూ మూగి
కోటి కోట్ల మెరుపులతో ఉరుములతో
చేయి కలిపి హూంకరించినా
మా ప్రేమ చలించదు
మా మమత నశించదు!
రేపటి ఆశ పురి విప్పుకుని
మయూర నాట్యం చేస్తుంది
రేపటి ఆశ గండు కోయిలలా గొంతెత్తి
మోహన రాగం పాడుతుంది!
ఎందుకో తెలుసా?
ప్రేమ పవిత్రం! ప్రేమ శాశ్వతం!
ప్రేమ అమలినం! ప్రేమ అమరం!
ప్రేమ త్యాగం! ప్రేమే దైవం!



