Facebook Twitter
శ్వేతపత్రం మీ హృదయం

శ్వేతపత్రం మీ హృదయం

                                                                                                                           శ్రీ శారద అశోకవర్ధన్

పిల్లలంటే దేముళ్ళ
    పిల్లలకి లేవు కక్షలూ కార్పణ్యాలు

    రకరకాల చెట్లూ చేమలూ,
    నలుపు తెలుపు మబ్బులూ మెఱుపులూ
    వేర్వేరుగా వున్నా ఒక దానితో ఒకటి
    పెనవేసుకు పోయినట్టే

    ఆకాశంలో తరల్లాగా
    భూలోకంలో నిలిచి వెలిగే
    పగటి చుక్కలు మీరు
    కిల కిల నవ్వే మీరు
    చకచక నడిచే కీలు బొమ్మలు మీరు
    చిలుకల మాదిరి
    చినచిన పలుకులు
    సింగారులు మీరు

    తళతళ మెరిసే మేలిమి బంగరు
    మేని గల పుత్తడి బొమ్మలు మీరు
    అమ్మ చేసిన బొమ్మగా అవతరించి

    కల్ల కపటము లెరుగని
    సిరిమల్లెలు చిన్నారులు మీరు!

    ప్రపంచమనే వనంలో విరబూసిన
    విరజాజులు చామంతులు పూబంతులు!
    కులమత కుటిలత్వాలు తెలీవు!
    కులం మతం కలబోసిన మంటల
    మరణహొమాలు తెలీవు!

    తెలిసిందల్లా అందరమూ మనుషులమేనని!
    అందరికీ మంచి గుణముండాలీ అని!
    పసి మనసుల లేత హృదయాలు
    స్వచ్చమైన పాల నురుగులాంటి
    తెల్ల కాగితాలు!
    మనసూ , మమతా,
    నీతీ నియమం ఎంచి ఎంచి రాసుకోదగిన
    శ్వేత పత్రాలు మీ హృదయాలు!
    స్వార్ధమంటే తెలీదు
    ద్వేషమన్నా తెలీదు
    తెలిసిందల్లా స్నేహంలోని తియ్యదనం
    ఆప్యాయతలోని మాధుర్యం!
    పాపలూ! మీరు రేపటి పౌరులు!
    హృదయమనే ఆ తెల్లని ఫలకం మీద
    పసితనంలో రాసుకున్న రాతలనే పదిలంగా దాచుకోండి!
    పెరిగే కొద్దీ తుడిపేసి కొత్తరాతలు రాయకండి!
    చెమ్మ చెక్కలతో చేతులు కలిపి ఆడుకుంటూన్నట్టే

    పుంగిరి వూతలలో చేతులు పట్టుకుని తీరుగుతూన్నట్టే
    కలిపి చేతులు విడవకండి!
    కలసిన బతులుకు విడదీయకండి!
    కలతలు లేని జీవితం
    కల కాలం గడపండి!
    ఒకే తాటిపై నడవండి
    ఒకే భాష ఒకే జాతి
    ఒకే నీతి ఒకే రితి
    తెలుగు బాలలం మేమంటూ
    తెలుగు తనమే మాదంటూ
    ప్రపంచమంతా చాటండి
    జాతి గౌరవం నిలపండి!