నింగీ నేలా ఏకం చేస్తా
శ్రీమతి శారద అశోకవర్ధన్

నది ఒడ్డున నట్టాడుతూ నక్షత్రాలను లెక్కబెడుతూ
ఆకాశంలోని అందాలను ఆస్వాదిస్తూ ఆనందించలేను
అడేనెమలీ పాడేకోయిలా పచ్చనిచెట్టు పశు పక్షిదులా
పసందుగా వున్నా పలకరిస్తూన్నా
ఆ అనుభూతిని నా వరకే పరిమితం చేసుకోలేను
పరవశిస్తూ పలవరిస్తూ ఆ పరిధిలోనే పడివుండలేను.
ఆ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆ దృశ్యాలను చిత్రస్తూ
అక్షరాల మేడలు కట్టి అందంగా రూపులుదిద్ది
కవ్వించే కలలుకంటూ కళ్లుమూసుకు బతకలేను
ఊహల ఊయలలో ఊగిపోలేను!
నదిమధ్యన సుడిగుండాల్లో కొట్టుమిట్టాడుతూ
అహరహం అలలతో కుస్తీ పడుతూ జీవనం సాగిస్తున్న
ప్రాణకోటిలో నేనూ పాలుపంచుకొని నింగినేలా ఏకం చేస్తాను.
సహ జీవనం సాగిస్తున్నానని తృప్తిపడతాను
గాలిలో నీటితో నింగితో నేలతో పోరాడి
జీవనం గడుపుతూన్నందుకు గర్వపడలేను
మొదటిది కోరికలూరించి బబ్బోపెట్టే సుషుప్తి!
రెండోది కోరడాతో కోట్టి లేపి బతుకు బాటను చాటేశక్తి!
నదిఒడ్డున పదిలంగా కూర్చుని
నక్షత్రాలు లెక్కబెడుతూ అక్షరాలతో
అనుభూతులు అల్లుకుంటూ కూర్చోవడం
సుషుప్తి!
అహరహం సుడిగుండంలో కొట్టిమిట్టాడుతూ
జీవనం సాగిస్తున్న ప్రాణకోటిలా బ్రతకడం
మనుగడకి మార్గం చైతన్యానికి నిదర్శనం!
సుషుప్తి జాతికి గొడ్డలి పెట్టు
జాగృతి జాతిని నడిపించే ప్రగతిమెట్టు



