Facebook Twitter
నమ్మకం

 " నమ్మకం "


జీవితానికి సారదై
జీవనానికి వారదై
ప్రేమకేమో పెన్నిదై 
స్నేహానికేమో సన్నిదై 
అమ్మలా ప్రేమిస్తూ
నాన్నలా కాపాడుతూ 
అన్నలా అనురాగం పంచుతూ 
తమ్ముడిలా అభిమానం చూపుతూ 
అక్కలా ఆప్యాయతను అందిస్తూ
చెల్లిలా చిరునవ్వుల్ని చిందిస్తూ 
ఆత్మీయుల ఆశీస్సులను అందిస్తూ 
అనుబంధాలను పెనవేసుకుంటూ
నీవు ఒక మనిషివని
నీకు మనసు ఉన్నదని
అది తీయని మాటలు పలుకునని
మాసిపోని మమతను పంచునని
చెదిరిపోని చిరునామాగా నిలిచునని
నిక్కచ్చిగా నిర్భయంగా నిన్ను
నలుగురి ముందు నిజానికి నిలువెత్తు
నిదర్శనంగా నిలబెట్టేది ఒక నమ్మకమే
ఆ నమ్మకం మంచితనంతో వస్తుంది
మానవతతో ప్రాణం పోసుకుంటుంది
మనిషివని గుర్తు చేస్తూ ఉంటుంది
ఆ మంచితనాన్ని వంచన చేస్తూ
ఆ నమ్మకాన్ని వమ్ముచేస్తూ
అబద్ధాలు ఆడుతూ
ఆత్యాశకు పోతూ
అవినీతికి అలవాటు పడితే
మంచికి చెడు సమాధానం అవుతుంది
ప్రేమకు బదులు అసహ్యం చోటు చేసుకుంటుంది
ఆశను నెట్టేసి నిరాశ చుట్టుకుంటుంది
బ్రతుకును నరకమయం చేస్తుంది 
జీవితం మీద విరక్తిని కలిగిస్తుంది
అప్పుడు మనకు మనమే కాదు
ఎవరికి మనం ఏమికాము
మనకు ఎవరు ఏమికారు
అందుకని నమ్మకానికి ఉన్న విలువను తెలుసుకో
నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకో !
నమ్మకం ఉన్న మనిషిగా చరిత్రలోకాదు
ఆత్మీయుల గుండెల్లో అనుబంధాల పెరుగుదలల్లో
చెదిరిపోని జ్ఞాపకమై నిలిచి ఉంటావు.



ఆ నమ్మకం విలువ తెలుసుకున్న వాళ్లకి  
అదే నమ్మకాన్ని పోగొట్టుకున్న వాళ్లకి అంకితం


రచన - శాగంటి శ్రీకృష్ణ