.png)
అమ్మకోటి
అమ్మా!
ఎప్పుడో నీ ఒళ్ళో కూర్చున్నట్లు
ఎక్కడో నీ ఉయ్యాల జంపాల ఊగినట్లు
జ్ఞాపకాల నీడల్లోంచి నీ గాజుల సవ్వడి
సుతిమెత్తని పువ్వుల్లా విప్పారుతుంటుంది
నన్నే చెత్తకుండీలో పడేశావ్
ఏ రైలు పట్టాల మీదికి తోసేశావ్
నా జీవితాక్షరాల్ని చిందరవందర చేశావ్
నా పసితనం పారేసుకున్న బొమ్మవైనావ్
ఎక్కడున్నావమ్మా!
పిల్చినా పలకవు
ఆకలేస్తే గోరుముద్దల్లేవు
మార్కులు చూసి ముద్దులు పెట్టావు
పీడకలలొస్తే పక్కనలేవు
జీవితం మోయలేని
అనిభావాల అరణ్యంలో
నీ పైట చెంగుకోసం
ప్రపంచమంతా వెదుక్కుంటున్నాను
నువ్వు చిల్లర పోగేసిన డబ్బా
నా మెళ్ళో కట్టిన తావీదు
నీ పాత పాస్ పోర్టు సైజు ఫోటో
అన్నింటినీ మించి
అచ్చం నీలాంటి నేను!
నన్నెవరు మెచ్చుకున్నా
ముందుగా నీకే చెప్పాలన్పిస్తుంది
కష్ట సుఖాలన్నీ కలబోసి రాసే 'అమ్మకోటి'లొ
నిత్యం నీ కోసమే కన్నీటి అన్వేషణ!
నన్నెందుకు అనాథని చేశావనే
అంతుదొరకని ప్రశ్నా నిరీక్షణ! ...
అమ్మ ఉన్న అదృష్టవంతుల్లారా!
అమ్మని బాధ పెట్టకండి
బరువనిపిస్తే
నా కిచ్చేయండి ... ప్లీజ్!
-సి. భవానీదేవి



