Facebook Twitter
ఆలోచించరూ

ఆలోచించరూ ...

చిల్లర భవానీదేవి

 

ఇంక తెగిన ఈ దారం కోసలతో

రెండు దృవాలను నా లేత చేతులతో

ముడి వేయలేను

యుద్దాలు దేశాలమధ్యే కాదు

గడప లోపల మౌనాయుధాలతో

కూడా జరుగుతుంటాయి  

ఎడమొహం పెడ మొహాల మధ్య

ఏకాకి నావ నా బతుకు వాదంవాదాల

మధ్య మూసినా పుస్తకం నా బాల్యం  

కలహాల కన్నీళ్ళ మధ్య

కోర్టు నిర్ణయం నా కస్టడీ

జన్మ నిచ్చిన ఇద్దరిలో

ఒక కన్నే నేనిప్పుడు ఎంచుకోవాల్సింది!  

మనసును వరించే నల్లకోట్ల కధనాలే అన్నీ!

పోరుని పెంచే పగముసుగుల పావులే అన్నీ!

ఇందరి కళ్ళలో జాలి నాకోసమేనా....?

అందరి హేళనా తిరస్కారాలు నాకు బహుమానాలా?  

పోరును ప్రోది చేసే నల్లకోట్ల తోడేళ్ళ

హాసాలలో భావి చూపుల

రెక్కలు విరిగిన పసిపావురాన్ని

జీవితకాలంపాటు పగుళ్ళ లేబుల్ ను

అతికే అమ్మానాన్నల్లారా

ఒక్కక్షణం నా గురించి నిజం గా ఆలోచించారా?!