అందాల ఇంతి - అవనికే చామంతి
అందాల ఇంతి - అవనికే చామంతి
పద్మా శ్రీరాం

మనసుకొమ్మ భారమైనప్పుడు
వసంతకోయిలవై వచ్చి
కలతల చిగుళ్ళు మేసి యద బరువు తీరుస్తావు
కనురెప్పల మైదానాలపై కలల విత్తనాలు జల్లి
కమ్మని నిద్దురను పంటగా ఇస్తావు
ఓటమితో కృంగిపోయి ఉన్నవేళ
ఓదార్పునిచ్చి ఆలంబనవై నిలిచి
అలవోకగా అద్భుతాలు సాధించే పోరాట పటిమనిస్తావు
ఆకలైనవేళ అన్నమౌతావు
ఆవేదనలో ఆప్తమౌతావు
అలసినవేళ అనురాగమౌతావు
ఆరాటాలవేళ అందమౌతావు
చివరకు నీకు మాత్రం నీవు శూన్యమౌతావు
ఇంతకు మించి నీగురించి ఏమి చెప్పగలమే
ఓ మహిళా ! ఇలలోని కళా !
నిను వర్ణింప శ్రీ"నాధుడికి" సైతం
సశేషమే ఓ లేమల్లీ !ఎందుకంటే
బ్రహ్మ సృష్టికే నీవొక విశేషమే ఓ చిట్టి తల్లీ
అమాశ కూడని సామాజిక జాబిల్లీ!



