Facebook Twitter
వాన కురిస్తే...

వాన కురిస్తే...

చిన్న చిన్న చినుకులలో తడుస్తూ
వెళ్ళిపోయిన బాల్యాన్ని
బాల్యంలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తూ
ఎగిరే ఊహలకు కాస్త కళ్ళెం వేస్తే ఎంత బావుంటుందో...

కాసేపలా నిలబడి కురిసే వానలో
తడుస్తూ..వేసారిపోయిన జీవితాన్నీ-
ఎండిపోయి అడుగంటుతున్న మానవత్వాన్ని
తడిచెమ్మతో నిద్దురలేపితే ఎంత బావుంటుందో..

అడ్డుపెట్టుకున్న అహంకారాన్ని
కాదని పోయిన నిన్నలను,మొన్నలనూ
వద్దనుకున్న విచారాలనూ..
వాన నీటితో కడిగేసుకుంటే ఎంత బావుంటుందో..

చిందులేస్తూ పసి బాల్యపు
ముగ్దత్వపు పరిమళాలని అనుభవిస్తూ
ప్రేమలు,అప్యాయతలు నింపుకుని
మరోసారి మనుషులమయితే ఎంత బావుంటుందో.

 

- సంధ్యాతులసి