Facebook Twitter
శ్రీ సు(దుర్)ముఖి కి స్వాగతం !

శ్రీ సు(దుర్)ముఖి కి స్వాగతం !

 

  

నెయ్యముజేయగ వచ్చెను,

అయ్యారే! దుర్ముఖి గను మనఘ మనముతో,

ఉయ్యల పాటలబాడుచు,

వయ్యారులు హారతెత్తి, వర్ధిలుమనరే !

,..............

కెందామర పోలికతో

మందానిల సౌరభముల మరువిల్లనగన్,

మందాకిని వలె దుర్ముఖి,

అందలమున వచ్చెనదిగొ అక్షతలిడరే !

...........

రాయంచ కులుకు నడకల,

నా యందము జూడుమనుచు నాదఝరులతో,

ఓ యంచు పిలచినంతనె,

ఓ యంచును వచ్చె పికము, ఓగితమొప్పన్.

................

రంగవల్లికలతో, రంజిల్లు ముంగిలుల

అంగజుడు తోడుగా, అవఘళించెను బాల,

వేప కొమ్మలనెక్కి వెయివేల రాగాల

అపరిమితగానమొనరించినదియాబాల.

రాకాసుధాకరుని అనుజగా ఇటకొచ్చి,

క్రీగంట వెన్నెలల క్రీడ సలిపెను మెచ్చి

పసరు రెక్కల పక్కి, కొసరుచుండగ తాను

మిస మిసలు చిందించె మెరపుతీగై చాన.

......................

తిలకమ్ము ధరియించి, తిరుమేని గంధమ్ము,
పూవుల సొబగుతో పూవుబోడి,
కస్తూరినలదుకో! కమలజు తల్లివై,
కలహంస నడకల కదలి రావె !
కిలకిల రవముల చివురు దిండినివోలె,
చెలియరో రావమ్మ చెన్నుగాను,
లతల ఊయలలందు లత్తుక పదముల,
అలకల కులుకుల అలరు బోడి !

లలిత హృదితోడ సౌభాగ్య లక్ష్మి గొలిచి,
నోరు నొవ్వంగ హరినామ స్మరణజేసి,
మనము రంజిల్ల నైవేద్య మందజేసి ,
సుఖము కాంక్షించి తనియరే సుకృతముగను !!!

 

- Padmini Puttaparthi