Facebook Twitter
కొన్ని జీవితాలు (కవిత)

రోడ్లపై రోజంతా పచార్లు చేస్తూ
నేను స్వేఛ్చాజీవినని చెప్పుకుంటూ
అందని ఆకాశానికి అర్రులు చాపుతుంటాం...

అరుగు మీద పడుకొని
మరునాడు పొద్దులో కలిసిపోయే పండు వెన్నెలను చూస్తూ
తెగ సంబరపడిపోతుంటాం...

నూతిలో కప్పలా
ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటుంటాం
పై నుంచి పడే రాయిని గుర్తించం...
చేతగానితనాన్నే కంఫర్ట్ జోన్ అనుకునే పిచ్చి నమ్మకాల్లో చితికిపోతూ ...

నిండు సముద్రంలో మునిగిపోతూ
ఆఖరి సెకను వరకు ఎవరైనా కాపాడకపోతారా
అని ఎదురుచూస్తుంటాం...
అర్థంలేని ఆశావాదం లో కొట్టుకుపోతూ....

అనవసర భావాలకు రూపాన్నిస్తూ
ఆత్మవంచన చేసుకుంటుంటాం..
నేనింతే అని గొప్పగా చెప్పుకుంటుంటాం..
దానికి మెటీరియలిసమ్ అని గుర్తింపు కుడా ఇస్తాం...

ఇంకెన్ని ఆశలను నమ్ముకుంటే..
ఇంకెంత ఆత్మలను అమ్ముకుంటే ...
మనం అనుకుంటున్న మెటీరియలిస్టిక్ లైఫ్ కి సార్థకత వస్తుందో... ప్చ్

 

..... సరిత భుాపతి