Facebook Twitter
ప్రశాంతత (కవిత)

 

ప్రశాంతత

 

 

ఏ బాదరాబందీ లేని కొన్ని మౌనాలు కావాలిప్పుడు
ఆడంబరాలన్నీ శూన్యమైపోయిన నిశ్శబ్ధం కొద్దిగా కావాలిప్పుడు
మెదడులో నిక్షిప్తమై ఒత్తిడి పెంచుతున్న పనుల చిట్టా టెంపరరీగా రిమూవ్ అయిపోవాలిప్పుడు

ఎంత యాంత్రికమైపోయాం మనం!
ఉదయం పూట లీలగా వచ్చి పలకరించే చల్లగాలిని గాబరా గాబరాగా సింక్ నీళ్ళ కింద స్నానం చేస్తున్న వేడి పప్పు కుక్కర్ ఎప్పుడూ డామినేట్ చేస్తూఉంటుంది

ఆఫీస్ నుంచి వస్తూ బురదలో ఆనందంగా ఎగురుతున్న వీధి బాలలను చూసి ఏం కోల్పోతున్నామో గ్రహించే లోపే..చీకటి పడితే బస్ మిస్సయిపోతామన్న భయం తొందరపెడ్తూ ఉంటుంది

ఇన్ని గంధరగోళాల తర్వాత రాత్రి వంట గుబులు .. శిథిలావస్థలో ఉన్న పాత టేప్ రికార్డర్ మూలుగును నొక్కి పెట్టేస్తుంది..

రోజంతా గజిబిజిగా విలవిల్లాడుతున్న మనసుకు
కొంత ప్రశాంతత కావాలిప్పుడు
ఒక నిశ్శబ్ధ శబ్ధాన్ని గుండెల నిండా నింపుకోవాలనుందిపుడు.

 

-సరిత భూపతి