జనని
( గణతంత్ర దినోత్సవం స్పెషల్))

కలం కదిపి గళం విప్పి
పాడనా నా తల్లి మధుర కావ్య కథలు
తరతరాల మధురిమల యశో చంద్ర సుధలు || పాడనా ||
ఆర్య భట్టుని 'శూన్య' మయినా
అంతు పట్టని శూన్య సిద్ధాంత మయినా
అమ్మ జ్ఞాన ఖని, ఈ కరణి
ఆమె కెవరు సాటి ఈ ధరణి ? || పాడనా ||
అవని లోన అంకెలకు జనని , నా జనని
పెక్కు భాషల పెద్దమ్మ కే అమ్మ , మా యమ్మ
సంస్కృతీ, నాగరికతలకు ఆమె పట్టుగొమ్మ
సుశ్రావ్య స్వరాల, సుందర నృత్యాల తరగని గని , ఈ పావని || పాడనా ||
గణ తంత్ర రాజ్యాలు,
గణితేతిహాసాలు
గణనీయ సాహితీ సౌరభ ప్రభాసాలు
గత వైభవాల గగన ప్రాభవాలు || పాడనా ||
సింధులోన విరిసి, గంగ పైన మెరిసి
కృష్ణ కావేరి ల తడిసి, హిందూ సగరమున మురిసి
హిమోత్తుంగత్తుంగాల కెగసి , కాశ్మీరమున కురిసి
విలసిల్లు నా తల్లి విశాల భరత వర్షి || పాడనా ||
- ప్రతాప్



