అన్నకు నివాళి
(జనవరి 18 న శ్రీ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా)

అందని అంబరాల కరిగిన అన్నా! ఓ నందమూరి !!
అందరి మా వందనం అందంద ప్రేమ మీరి
అదిగదిగో కదలి వచ్చె, ఆవేదన పంచుకున్న అన్ననే మన వైపు తెచ్చె
మసి పట్టిన మన జాతిని, కలసి కట్టి, వెన్ను దట్టి, పోరాడగా వెలుగు నిచ్చె
కొట్టాడే కొన ఊపిరి, అట్టడిగిన ఆత్మ గౌరవం , సడలిన స్వాభిమానం
చేయి పట్టి , భుజం పెట్టి ,తెనుగు జాతి రీతి మార్చి , చూపెట్టెను తేజో పథం
చిచ్చర పిడుగుల అడుగుల చీకటినే తిప్పి కొట్టి, పూరించెను సమర శంఖం,
శృంఖలాలె తెంచి, విజయం సాధించి, అమరుడైన మా అన్నది - ఆ చైతన్య రథం
ఆకలి తో అలమటించు అన్నార్తుల కగ్గువ బియ్యం
మల , మలలాడే విద్యార్థుల కు మధ్యాహ్నపు భోజనం
అనాది గా అణగారిన ఆడ పడుచుల కాస్తి హక్కు
సంసారాలే సమసిన సారాయికి, నిషేధమే మంచి నొక్కు
అడ పొడ లేని, అడలిన విపక్షాల కట్టి కూర్చె 'జాతీయ వేదిక' సంగరంగ
తల్లడిల్లు సోదరులు తమిళుల దప్పి దీర్చె జాతి ఘనత పెంచి తెలుగు గంగ
అంతలింతలు కాదు తెలుగు దేశం నేలు నీవు చేసిన మేలు,
పచ్చంగా మా మది పదిలింగ మెదులు నది పది కాలాలు
కరకు బోయడె కాదు , కరుణార్ద్ర కృతికర్త ఆది కవి యతడు
వీర బ్రహ్మేంద్రుడు , విజిత బ్రహ్మ నాయుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు
సతిని కోలుపడి పరమేశ్వరుడు , శ్రీనాథుడు - సరస శృంగార ప్రబంధ పరమేశ్వరుడు
రోషమే రంగరించిన రంగరాయలు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు కృష్ణ రాయలు
ఉత్తర కొమరికి అమరిన మహత్తర నృత్య బుధుడు పేడి బృహన్నలుడు
ఉత్తర గోగ్రహణ సమరాన మహోత్తర శస్త్ర కోవిదుడు విజయు డర్జునుడు
కులసతికి బాసట గ కుప్పించి ఎగసి, బాస బూనిన కొదమ సింగం వాడు కుంతీ మధ్యముడు భీమసేనుడు
శత సోదర శిరో మకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణుడు, అభిమాన ధనుడు సుయోధనుడు
కైలాస మే కదలి వడుక గా, హిమోత్తుంగ నగమే నడుక గా రుధిరమ్ము పొంగించి ,
రౌద్ర వీణా రవమున, రప్పించి రుద్రు రయమున , మెప్పించె అకలంక జంగ మేశ్వరుడు లంకేశ్వరుడు
ఇలను ధర్మము గఱపి , ఇన కులాన్వయ కీర్తి నిల్పి జన మనోభిరాముడు శ్రీరాముడు
నిగమాగమ కర్త , సకల భువన భర్త , భక్తి , రక్తి భోక్త , వేద గీత వక్త శ్రీ కృష్ణ భగవానుడు
నట విరాట్టుగ నీ విశ్వరూపం , నచ్చి, వచ్చి, మెచ్చి జనత సల్పె వంది , నీరాజనం
కళ్ళకు కట్టినట్టు , గత మంతా మతికొస్తే , గట్టిగ ఒళ్ళంతా తెలియని గగుర్పాటు
ఇక మీదట తీరే దెటు, నిద్ర లేపి బాట చూపిన , నీవు లేని ఆ లోటు
ఎందైనా , ఎపుడైనా , మా ఎదలో నీకె గదా నిండైన ఆ చోటు
కను మరుగై, ఎగిరి నీవు గగనాల కరిగినా , ఎరిగి మాకు అన్నా! నటుడి గా , నాయకుడి గా నీకు నీవే దీటు
అందుకో అన్నా! నందమూరి!! ఇందు మా నివాళి
ఎందున్నా నీకె చెందు ఎల్ల తెనుగు మానవాళి
- ప్రతాప్



