TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
వసివాడిన పసి ప్రాయం!
బడికి నోచుకోని బాల్యం
దౌర్భల్యపు బతుకు వెతుకులాటలో
గతికే కాసిన్ని మెతుకుల కోసం చితికిపోతుంది
పస్తులుండలేక పనికి కుదిరితే
సుస్తీ చేసినా తప్పని భారాన్ని మోస్తూ
చేయందుకునే దోస్తీ కోసం ఎదురు చూస్తుంది
ఐశ్వర్యం స్వైర విహారంతో
ఆకలి రోకలి పోటుకు బలౌతూ
ధైర్యం కోల్పోయి దైన్యం చవి చూస్తుంది
డక్కాముక్కీల తొక్కిసలాటలో
బక్కచిక్కిన బొందిపై అంతుచిక్కని
గాయాలకు మందు రాసే దిక్కుకై మొక్కుతుంది
గడిచిన రోజుకు దండం పెడుతూ
పొద్దు పొడిచే దండన తలచుకుంటూ
కన్నీటి కలల అలలపై తలవాల్చుతుంది
వసివాడిన పసి ప్రాయం!
రచన : వెంకు సనాతని
TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
|