Facebook Twitter
నీకోసం సిగరెట్ వెలిగించా!

నీకోసం సిగరెట్ వెలిగించా!

 

 

 

నీకోసం నీకోసం ఈసిగరెట్ వెలిగించా!
గాలిలోన తేలిపోవు
ఉంగరాల పొగను నేనుచూస్తుంటే
నీవు నన్ను చూడాలని
నేనది గమనించి అటేచూచినపుడు
నీవు ఎటో చూడాలని
చూపులతో దోబూచులు ఆడాలని
ఈసిగరెట్ వెలిగించా నీకోసం.

నీకొరకై నే నేమీ రాజ్యాలు గెలువలేదు,
సప్తసముద్రాలు దాటి పెనుగొండలు తొలువలేదు,
నలుదిక్కుల కోళ్ళుగాగ
భూసింహాసనము నీవు ప్రతిష్ఠింప
రారాజుల మౌళిరత్నరోచిస్సుల
నీ మెత్తటి పాదాలకు అభిషేకం చేయలేదు.
నీ కీర్తి పూజకొరకై పాటలపూలైనా కోయలేదు.
లేనివాణ్ణి; నా దగ్గర ఏమున్నది ఇచ్చేందుకు?
నా నెత్తురు గడ్డకట్టి; కన్నీరులు ఆవిరిగా యింకిపోయి
ఈ సిగరెట్ పొగలో
నీ సాన్నిధ్యపు సెగలో
కటికబ్రతుకు బండరాయి కరిగేందుకు
ఈ సిగరెట్ వెలిగించా నీ కోసం, నా కోసం.

జీవిత జాగరంతో వాడిన నీ మసక కనుల
ముందునిలచి నర్తించే ఈ చిరుపొగ ఉంగరాలు
కాలుని భాండారంలో దొంగిలించి తెచ్చిన యీ
నీ తియ్యని సాన్నిధ్యపు లఘు క్షణాలు
అదృష్టం ఏమరి యిచ్చిన వరాలు
అందుకనే ఈ సిగరెట్ వెలిగించా నీ కోసం!

శూన్యములో కలుస్తోన్న సిగరెట్పొగ
పరుగిడు కాలపు వడిలో నన్ను వీడుతున్న నీవు
రెప్పపాటులో ఇక మిగలదు ఏమీ;
కాని జీవితపు శూన్యం నింపేందుకు
మళ్ళీ వెలిగిన నా సిగరెట్ పొగలో నీ
జ్ఞాపకాల సువాసనలు గుబులుకొంటయ్!
నీకొరకై వెదుకుతున్న కండ్లల్లో
నీసాన్నిధ్యపు నీడలలముకొంటయ్.
ఒకసిగరెట్ వెలిగిస్తా మరల నేను నీకోసం!

(బైరాగి రాసిన కవితల సంపుటి ‘చీకటినీడలు’ నుంచి)