Facebook Twitter
మహాగీతం

 

మహాగీతం

 

 


చరిత్ర పాడని ధరిత్రి చూడని
పవిత్రగీతం పాడండి
విచిత్ర భూతం చూడండి

నరాలలో తరతరాల గాథలు
శిరస్సులో నరనరాల బాధలు
గిరి శిరస్సుపై హరీంద్ర గర్జన
మన మనస్సులో తర్జన భర్జన
పర ప్రభుత్వపు టురికంబాలు
ప్రజాప్రభుత్వపు గజిబిజి చర్యలు
స్వతంత్రమంటూ పెద్ద మాటలు
కుతంత్రాలతో గ్రుద్దులాటలు
విన్నాం కన్నాం కన్నాం విన్నాం

చరిత్ర పాడని ధరిత్రి చూడని
పవిత్రగీతం పాడండి
విచిత్ర భూతం చూడండి

ఊరి ఊరి పొలిమేరలు మారి
దేశదేశ సహవాసం కోరీ
జాతిమతాలను పాతరవేసి
సామ్రాజ్యాలకు సమాధిచేసి
అడుగు కడుగుకూ మడుగులు కట్టిన
యెడద నెత్తురులు వడబోయించి
ముల్లుముల్లుకూ చిళ్ళిన రక్తం
గులాబీల రంగులై వెలింగి
యూరపు, తూరుపు, ఏషియ, రషియా
భారత, సింహళ, బర్మా, వీట్నాం
అమెరికా, బ్రిటన్ శ్రమజీవులతో
శ్రమజీవులతో, సమభావులతో
అమర్చి కూర్చిన, జగాన్ని మార్చిన
విశాల విశ్వశ్రామిక భూతం
మహోగ్ర భూతం
ఉల్కాపాతం
ఉత్తర ధ్రువాత్యున్నత శీతం
వజ్రాఘాతం
ప్రళయోత్పాతం ---

పరుగెత్తే హిమగిరి
ఎదురు నడచు గంగాఝరి
కంపించే ఇలాతలం
కదలాడిన గభీర సముద్రజలం
పేలిన కోటికోటి తారలు
కురిసిన ప్రళయ వర్షధారలు
గ్రీష్మంలో తగులబడే
పెద్దపెద్ద కొండలు
కరువులతో వణకిన
నిరుపేదల గుండెలు
కేంద్రీకృత పీడిత భూతం

విరాట్ స్వరూపం
మహేంద్ర చాపం
ఉచ్ఛ్వసించితే, నిశ్శ్వసించితే --
నింగి నంటు కరెన్సీ గోడలు
నీల్గుతున్న బాంబుల మెడలు
నుగ్గునుగ్గుగా తగ్గిపోవునట!

"అది రక్తగంగా తరంగమా?
అంత్య మహా యుద్ధరంగమా?"    

"అమృతం ముందరి హలాహలం
పంటలు సిద్ధం కానిపొలం
ఫలితానికి ముందటి త్యాగం
నిరుపేదల నెత్తుటి రాగం
పడగెత్తిన మహోగ్ర నాగం
తగలబడే ధనికుల భోగం
అరుణారుణ విప్లవమేఘం
నయయుగ మహా ప్రజౌఘం"

"ఆ మహాతరంగానికి అవతల?
ఆ యుద్ధరంగానికి అవతల?"

"నిజమై ధ్వజమెత్తిన కల,
గగనానికి నిక్కిన పేదల తల
ఉక్కుటడుగు త్రొక్కిడిలో
పడి నలిగిన గడ్డిపోచ
చెక్కుచెదర కొక్కుమ్మడి
చక్కవడిన ఇనుప ఊచ
తెగిపోయిన మృత్యుశవం
వినిపించని ధనారవం."

చరిత్ర పాడని ధరిత్రి చూడని
పవిత్రగీతం పాడండి
విచిత్ర భూతం చూడండి
(దాశరథి కృష్ణమాచార్య రాసిన రుద్రవీణ కవితాసంపుటంలోంచి)