కవితాకోపం
కవితాకోపం
పాడను, పాటలు పాడను
వాడను, పదాలు వాడను
వేడను, దేవుళ్ళను
దెయ్యాలను వేడను.
ఓడను, రాజుకు
ధనరాజుకు
రారాజుకు
ఓడను
గోడను, ధనవంతుల
కనక సౌధ
మున కివతల
వణకే నిరుపేదల
అడుసు
గుడిసె గోడను.
నన్ను చూచి ఎందుకొ
మిన్నాగులు ఇట్లా
పారాడుతు జీరాడుతు
వస్తుంటాయి?
నన్ను చూచి ఎందుకొ
పున్నాగలు ఇట్లా
తారాడుతు, గోరాడుతు
పూస్తుంటాయి?
ఇది లోకం
నరలోకం
నరకంలో లోకం నరలోకం.
ఏనాడో తెలుసు నాకు
ఈ నిరీహ
నీరవ
నిస్స్వార్థ
నిర్ధన
నీచ నీచ మానవునికి
నిలువ నీడలేదు జగతి.
లేదు లేదు విలువ లేదు
రక్తానికి
ప్రాణానికి
శ్రమకూ
సౌజన్యానికి
రచయితకూ
శ్రామికునికి
రమణీ
రమణీయ
మణీ హృదయానికి
విలువలేదు, విలువ లేదు.
(దాశరథి కృష్ణమాచార్య రాసిన అగ్నిధార కవితా సంపుటిలోని ‘కవితాకోపం’లోని కొంతభాగం)
