Facebook Twitter
ఇంటింటి రామాయణం

ఏదీ…మారలేదు.
ఆరోజు….
లేనిది… ఉందని
ఉన్నది ఎత్తి పెట్టుకొని
కొంచం కారంగా, కొంచం ఉప్పగా,
కొంచం తీయగా, కొంచం కన్నీళ్లుగా
తిరగొట్టుకొని
అడుగు నుండి అడుగులోకి
గొంతు నుండి గొంతులోకి
త్యాగమో, తెగింపో
మెత్తగా జారడం
అప్పుడూ…ఉంది
ఇప్పుడూ… ఉంది.

ఎందుకో…? మారడం లేదు
మున్ముందు మారుతుందని కూడా
అనుకోవడం లేదు
మారాలని
మారి…
కడుపులో ఎలుకల రొదను
చంపాలని
ఆశించడం శిక్ష…
మరి…నేను… నేరం చేసిందెప్పుడు?

ముప్పై ఏళ్లుగా అదే కంచం…
నిన్న వృధా అనుకున్నది…
రేపటికి పనికిరాదనుకున్నది
చెడిపోతుందేమోనని
భయం భయంగా
నేటి జీవితం.

మా ఇంటి ఆడోళ్లు  
ఎప్పుడు మరణించారో
సరిగా గుర్తు రావడం లేదు
ఈగలు ముసిరిన చోటో 
చెల్లాచెదురైన సమయాన్ని
మంచం మీద కుప్పగా పోసిన చోటో
గతమూ, వర్తమానమూ
భవిష్యత్తుకు గుండుసూదౌతుంది 

ఓ…బేగం
ఆ చెత్తకుప్పలో నువ్వు విసిరింది
నా చెమటే. 
 

- లై