
దూరాకాశాన్ని తాకే ప్రయత్నం చేస్తున్న నీలిసముద్రమూ...
పాదాలను తడుపుతున్న గలగలల కెరటాల నురుగూ...
తడి ఇసకమీద వొట్టి పాదాల్తో నడుస్తున్న తొమ్మిది పదేళ్ల కుర్రాడూ...
60 సంవత్సరాల కిత్రం నా యానాం అంటూ కవి శిఖామణి చెబుతుంటే వినాలి. బాల్యపు విషాద సంగీతాన్ని తేలికైన మాటల్లోనే వినిపిస్తాడు.
ఆ సాయంకాలపు చిరుచీకటి వేదనని శిఖామణి చెప్పినపుడే అది కావ్యం అవుతుంది.
ఎవరో శిఖామణి అనే పెద్దాయన ఈ బక్కపల్చని అందమైన సంజీవరావు అనే కుర్రాణ్ణి పెంచాడు. భారతి లాంటి పత్రికల్లో అచ్చయ్యాక, నలుగురూ మెచ్చుకున్నాక అమ్మలాగా పెంచినవాడిమీద ప్రేమతో.. శిఖామణి అని పేరు మార్చుకున్నాడు. ప్రకృతిలోని అందమంతా నేలమీదకి దిగివచ్చినట్టుండే నాటి యానాంలో ప్రతీదీ చవగ్గానే దొరికేది.
అవి కొనడానికీ చిల్లర డబ్బులు లేని రోజులవి! యానాం రోడ్లమీద నిరాశతో కలసి నడిచిన కాలాన్ని శిఖామణి ఎన్నడూ మరిచిపోలేదు. ఈ సమాజం తక్కువ చూపు చూడడానికి ఇష్టపడే మాలవాడలో పుట్టాననీ అతనెప్పుడూ మరచిపోలేదు.
అప్పటికి అంబేడ్కర్ పేరు విన్నాడో లేదో గానీ చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. అక్కడ తాటాకు పాకల్లో మట్టి కుండలో వండిన అన్నమూ, రాయిమీద నూరిన దోసకాయ పచ్చడీ, నాన్న వండిన చిన్నచేపల కూరా .. నన్ను బతికించాయన్న రుచికరమైన రోజుల్నీ అతనెప్పుడూ మరచిపోలేదు. అందుకేనేమో, ఉల్లిపాయలూ, పచ్చిమిర్చీ తరుగుతున్నట్టే, బట్టలుపిండి ఆరేస్తున్నట్టే, కన్నీళ్లతో కలత నిద్రపోతున్నట్టే రాస్తాడు కవిత్వం.
రాస్కాల్నికోవ్ అనీ, అండ్ క్వయిట్ ఫ్లోస్ ది డాన్ అనీ, గాన్ విత్ ది విండ్ అనీ, హవ్ మచ్ లాండ్ డజ్ ఎ మేన్ నీడ్...అనీ శిఖామణి మాట్లాడే ప్రయత్నం చేయడు. అకిరాకురోసవా, మాజిద్ మాజిది, ఐజెన్‌స్టీన్, సత్యజిత్‌రే అనీ ఉపన్యాసాలు దంచడు.
యానాంలో దిగిన విరిగిన మెట్ల మీదా, అమలాపురం చెట్ల నీడల్లో, దరిద్రానికి ఆనవాళ్లుగా మిగిలిన దళితవాడల్లోనూ కవితా దీపాలు వెలిగిస్తాడు.

శిఖామణి తొలి కవితా సంపుటికి శ్రద్ధగా ప్రూఫ్‌రీడింగ్ చేసి, పుస్తకం తెచ్చే బాధ్యత తీసుకున్నవాడి పేరు...కవి ఇస్మాయిల్. శిఖామణి కవిత్వాన్ని ముత్యాలకోవలాంటి అక్షరాలతో తిరగరాసి భారతి’కి పంపించిన మరొకడు గాలి నాసరరెడ్డి. 26 ఏళ్లక్రితం కావొచ్చు. ఖైరతాబాద్ పెద్ద గణేషుడి విగ్రహం దగ్గరలోనే ఆర్టిస్ట్ మోహన్ ఆఫీసు వుండేది.సాయంత్రాలు సోడా పట్టుకుని శిఖామణి వచ్చేవాడు. అక్కడ ఒక రోడ్డు దాటితే, మలుపులో శిఖామణి ఇల్లు. ఒకరోజు చిన్న నల్లగేటు తీసుకుని కవి ఇంటికి వెళ్లాను. అక్కడో తెల్లని పూలచెట్టు. కొన్ని నెలల తర్వాత కొత్త కవితా సంపుటి పట్టుకుని వచ్చాడు మోహన్ దగ్గరికి. దాని పేరు ‘నల్లగేటూ, నందివర్ధనం చెట్టూ’. నేను షాక్ కంటే కొంచెం ఎక్కువే తిన్నాను. అందరం బతుకుతాం. కానీ కవిత్వంలా బతకడం బావుంటుంది. మువ్వల చేతికర్ర, తవ్వకం, గిజిగాడు, కిర్రుచెప్పుల భాష, తెల్లవారుజాము కల,..ఇలా ఉంటాయి అతని పుస్తకాల పేర్లు. ఎంతో సహజంగా, కోనసీమ పంటకాల్వల గట్ల వెంట పూచిన పువ్వుల్లాగే.
ఫిడేలు రాగాల డజన్.. పట్టాభి కవిత్వంమీద పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు, శిఖామణి బెంగళూరులో పట్టాభి ఇంటికి వెళ్లాడు. ఒక సాయంత్రం, పట్టాభి, స్నేహలతారెడ్డి కూతురు నందన, ఒక పిచ్చి పేంటూ, టీషర్టూ వేసుకొచ్చి నానా ఆరు బీర్లు తెచ్చాను అని ఇంగ్లిష్‌లో చెప్పినపుడు, తెగ ఆశ్చర్యపోయానని శిఖా నాతో చెప్పాడు. అప్పటికి సంస్కార తీసిన గ్లోరీతో పట్టాభి వెలిగిపోతున్నాడు.
ఓ రోజు పొద్దున్నే తల్లావఝుల శివాజీ ఫోన్ చేసి, మా బాప్ప చదివావా? అని అడిగారు. ఆవిడెవరు? అన్నాను. శిఖామణి కవిత్వం అన్నారు.
నల్లని, దృఢకాయురాలైన తల్లిలాంటి బాప్ప గురించి రాసిన మరిచిపోలేని పొయెం అది.
కొబ్బరికొట్టు పనిలో...తొడకు కాయను ఆనించి
మూడు చెక్కల్లో వొలిచిన మా బాప్ప
కారంచేడులో ఎందుకు పుట్టలేదా అనుకుంటాను.
ఊరుతో వైరం వచ్చినపుడు
చెంగులో ఇంత కారప్పొడి
చేతిలో హరికేన్ లాంతరుతో
తెల్లవార్లూ ఏటిగట్టున కాపలా తిరిగిన మా బాప్ప
చుండూరులో ఎందుకు పుట్టలేదా అనుకుంటాను...
అని ముగుస్తుందీ కవిత.
భూమిని ఓజోను పొర రక్షిస్తున్నట్టు, సమస్త మానవాళికీ కవిత్వం రక్షణ కవచంగా నిలిచిందనీ, నిలుస్తుందనీ నా నమ్మకం అంటాడు శిఖామణి.
ఆర్టిస్ట్ మోహన్ చనిపోయాక, మా గురించి, అన్న లేని ఇంటికి అనే కవిత రాశాడు శిఖా. సంకెళ్లు తెంచిన బిగి పిడికిలిని చిత్రించిన అతని కుంచె నుంచి పగలు సూర్యుడు ఇంత వేడిమినీ, పౌర్ణమిరోజు పోటెత్తిన కెరటాలను చిత్రించిన అతని కుంచె నుంచి రాత్రి చంద్రుడు ఇంత చల్లదనాన్నీ అప్పుగా అడిగి తీసుకుంటారు అన్నాడు కవి.
బాలగంగాధర తిలక్ శతజయంతికి కవులందరి వ్యాసాలతో శిఖామణి తెచ్చిన విలువైన సంకలనం పేరు అమృతవర్షిణి. కవిత్వం, విమర్శ గ్రంథాలు ప్రచురించడం, సభలు జరపడం, కవిసంధ్య పత్రిక క్రమంతప్పకుండా తీసుకురావడం, శిఖా సమగ్ర సాహిత్య సంపుటాలు వేయడం.. ఒక కఠోరమైన క్రమశిక్షణ ఇతనికి అబ్బిన దురలవాటు.
ఎన్ని చేసినా, ఎన్ని కబుర్లు చెప్పినా, వెటకారాలు పోయినా సింపుల్‌గా, అతి లేకుండా చీకటి పడుతున్నపుడు టేబుల్ మీద విస్కీ గ్లాసులా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాడు.
నన్ను సముద్రపు వొడ్డున వొదిలేయండి
ముత్యం దొరకలేదని బాధపడను
ఇసుకతో పిచ్చుకగూళ్లు కట్టి
ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాను
నన్ను తూనీగలాగో, సీతాకోకచిలకలాగో
గాలిలో వొదిలేయండి,
పూలు లేవని...వెన్నెల, ఇంద్రచాపం లేదని చిన్నబుచ్చుకోను
గాలిభాషకు వ్యాకరణం రాసిపారేసిన వర్షాల గురించి
వాయుగుండాల గురించి
మీ చెవిలో రహస్యాలను వూదేస్తాను...అంటూ
అంతే నిరాడంబరంగా రాస్తాడు.
కెరటాల మీద చినుకుల సంగీతం వినిస్తాడు.
ఈ తెలుగు ప్రొఫెసర్ నాంపల్లి తెలుగు యూనివర్శిటీ నుంచి, చీకటి పడుతున్నవేళ, బంజారా హిల్స్‌లోని ఆర్టిస్ట్ మోహన్ ఆఫీసుకు దాహంతో వచ్చేవాడు.
సార్ ప్రకాష్‌గారూ, బావున్నారా? ఇదిగో ఓ చిన్న పొయెం. పెద్దవారు. మీ ఒపీనియన్ చెప్పండి అనేవాడు, పార్టీ మొదలయిన తొలి నిముషాల్లో...
మూడో పెగ్గు తర్వాత, నిండుపున్నమిలాంటి అనుభూతి వెన్నెల కవి శిఖామణి–ఒరిజినల్ కర్రి సంజీవరావులాగా మారిపోయే దృశ్యాన్ని చూసితీరాలి.
ఏరా, ప్రకాషూ...నా కొడకా...ప్రతివాడూ కవిత్వం గురించి మాట్లాడేవాడే. చెప్తా...ఒక్కొక్కడి పనీ అంటూ చెలరేగి, నిజరూప దర్శన సౌభాగ్యం కలిగించేవాడు, ఎంతో నేచురల్‌గా...ఎంతో బ్యూటిఫుల్‌గా...అవి నాకు నచ్చిన క్షణాలు...వేగుంట మోహన్ ప్రసాదు బతికిన క్షణాలు అని రాసినట్టు. ఎప్పటికైనా, శిఖామణి ఉతికి ఆరేసిన క్షణాలు అని రాయకపోతానా!
పోనీ...దాట్ల దేవదానంరాజునో, మధునాపంతుల సత్యనారాయణ్ణో, ప్రసాదమూర్తినో అడిగినా చెబుతారు.
శిఖామణికి జన్మదిన శుభాకాంక్షలు
– తాడి ప్రకాష్



