TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
'సలలిత సుధారస సారం అన్నట్లు' ఇచ్చుటలోని అనంతమైన హాయిని అనుభవింపగల్గిన రసజ్ఞమైన మూర్తిమత్వం! సాహిత్యాన్ని, సా'హితం' తాలూకు విస్తారమైన ఆత్మసౌందర్యాన్ని ఆత్మ సాక్షాత్కారాలను తనవిగా జేసుకొని అక్షరాల అల్లికకు దారం తానవుతూ, భాష, భాస తాలూకు సాహిత్య పరిమళాలకు పట్టుగొమ్మ తానవగల్గిన మహోన్నత మహతీ మయమూర్తితత్వం అంగలకుదిటి సుందరాచారిది అన్నది నా ప్రగాఢ విశ్వాసం. వర్తమానాన్ని సాహితీమూలాలతో బేరీజువేసుకొని, చరిత్రలో అన్వయించుకొని తానే ఓ వర్తమానంగా, చరిత్రగా సాక్షాత్కరింపగలిగే వారాయన. చెప్పాలంటే సాహితీవేత్తగా, గొప్ప సాహితీ ప్రియునిగా జీవనోపాధి కోసం నెలకొల్పుతున్న ముచ్చటయిన మూడు రైసు మిల్లుల వ్యాపారాలలో కూడ సాహిత్యం తాలూకు హితాన్ని తనదిగా చేసుకున్న చరితార్థులు అంగలకుదిటి.
అంగలకుదిటి సుందరాచారి సాహితీ సంస్కృతులకు, కళాభిజ్ఞతలకు ఆలవాలమయిన ప్రకాశం జిల్లా వేటపాలెం నివాసి. ఆనాడూ ఈనాడూ కూడా లక్ష్మీసరస్వతులు కొలువు దీరిన ధీరవంశంగా వీరి అంగలకుదిటి వంశం ప్రాచుర్యం పొందగల్గింది. చిత్రలేఖనం తాలూకు ప్రతిభ, శిల్పకళా పాటవాలతో పునరుత్తేజం పొందిన వంశం వీరిది. తల్లి శేషమ్మ చిత్రలేఖనాన, తండ్రి మల్లికార్జునాచార్యులు శిల్పకళలలోను అందెవేసిన చేతులయి, ఆనాటి కాల ప్రభాలను తమ దోసిలినందిట కాంతులీనుట్లు చేయగల్గిన దివ్యమూర్తులు. సుందరాచారి జననీజనకుల అభినివేశాలను తనకు సొంపైన సాహితీ ప్రక్రియలతో అన్వయం చేసుకోగలిగారు. తెలుగు శారదాంబ దివ్య వీక్షణ కటాక్షాలతో తన మిల్లులలో పరుచుకున్న మేలు రకపు ధాన్యరాశులాగానే అక్షరరాశుల్ని సైతం పొంది చేసుకున్న ఆ తరపు మానవేతిహాసపు మహోత్కృష్ట నిర్వచనం ఆయన. సాహిత్యం తన ఊపిరిగా... సాహిత్యమే తపనగా... సాహితమే తన అనుశ్వాసగా చేసుకొని ఎందరెందరో వర్ధమానులనుండి లబ్ద ప్రతిష్టల దాకా సాహిత్యకారుల అక్షర తృష్ణకు తాను ఆలంబనగా నిలిచిన సంపూర్ణ మానవుడాయన. భాష మీద మక్కువతో భాషా పునరుజ్జీవనాన్ని ఒక సామాజిక బాధ్యతగా చేసుకొని స్వంత ధనాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేసుకొని అనేకమంది చిన్న పెద్ద కవులు సృష్టించిన కవిత్వాన్ని వెలుగు చూసేలా చేసిన మహనీయుడాయన. ఆ సందర్భంగా అనేకమంది గ్రంథాలను ముద్రించి ప్రోత్సహించిన వదాన్య మూర్తిమత్వం అంగలకుదిటి సుందరాచారిది. వీరు నిత్య చైతన్యశీలి. అక్షరార్చనలో పునీతం కాగల్గిన సువర్ణ శోభితుడు. తరచూ తమ ప్రాంతాలలో ఎన్నెన్నో కవి సమ్మేళనాలను నిర్వహించడం ద్వారాను, ప్రముఖ కవివరేణ్యులను తమ ఊరికి ఆహ్వానించి వారి ప్రతిభకు పట్టాభిషేకం చేయడం ద్వారాను, సత్కరించడం ద్వారాను ఒక ఉన్నతమైన ఒరవడికి తెరతీయగలిగారు. ఉత్తమమయిన సందర్భానికి అనుసృజన కాగలిగారు. తమ కుటుంబంలో జరిగే వివాహాది శుభకార్యాలలోను, ఆనందకరమైన సందర్భాలలోను, వేడుకలలోను పదిమందిని పిలిచి అత్యంత భక్తి భావనలతో సాహితీగోష్టులను, కవి సమ్మేళనాలను నిర్వహించేవారు. ముఖ్యంగా తమ వ్యాపార కూడలి అయిన మూడు రైసు మిల్లుల ప్రారంభ సమయాలలోను, తమ ఇద్దరు చిరంజీవుల వివాహ వేడుకలలోను, అక్షరాభ్యాస సమయాలలోను అత్యున్నతమైన రీతిలో సాహిత్య కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా అరుదైన సత్ సంప్రదాయానికి అంకురార్పణ చేయగలిగారు. ఆ వారసత్వం ఈనాడు చీరాల, వేటపాలెం ప్రాంతాలలో చిరాయువుగా వర్ధిల్లుతోంది. చెప్పాలంటే శ్రీమాన్ అంగలకుదిటి సుందరాచారి మానవీయ విలువలు తెలిసిన మనిషి, మర్మాలు ఎరుగని వ్యక్తి. తెలిసిన విలువలను మనసా వాచా ఆచరింపగలిగిన మనిషి. అందుకే వారు విలువల రాజీవనాన విలక్షణ సంతకమై అలరారుతున్నారు.
పరమార్థాలను తనవిగా చేసుకోగల్గిన ఆయనకు ఉత్థానమే తప్ప పతనం అనేది ఎరుగకపోవడానికి కారణం వారిలోని ధర్మనిరతి, అంకితభావం, మంచి ఆలోచనా అనురక్తి అని చెప్పక తప్పదు.
సామాజికంగాను, సాంకేతికంగాను ఎన్నేసి మార్పులొస్తున్నా తన వ్యాపారాలలో నిబద్ధతను విడనాడని, విచక్షణతో అడుగులెడగల్గినవారు. జీవితాన్ని చిత్రికపట్టి పదును తేల్చడంలో వారు చేసిన కఠోరకృషి వారి జన్మసంస్కారాన్ని తేటతెల్లం చేయగల్గుతుంది. జన్మతః అబ్బిన సాహిత్యం తాలూకు సంస్కారాన్ని ఆయన అలవోకగా తీసుకోలేదు కాబట్టే, దానిలో అలౌకికమైన ఆనందాన్ని అనుభవింప తేటతెల్లం చేయగలిగేవి. పంతొమ్మిది వందల డెబ్భై దశకంలోనే 'అంగలకుదిటి సుందరాచారి చారిటీస్' అనే స్వచ్ఛద సంస్థను స్థాపించి దాని ద్వారా ఏటా అనేకమంది కళాకారులను ప్రోత్సహించేవారు. కవులను సత్కరించేవారు ఆంధ్రదేశంలో మంచి అరుదైన సంస్థగా ప్రాచుర్యం పొందిన దీనిలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా॥ రావూరి భరద్వాజ, డా॥ నాగభైరవ, నందమూరి లక్ష్మీపార్వతి, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, వి.వి.యల్ నరసింహరావు, ఎర్రోజు మాధవాచారి, కొండూరి రాఘవాచారి, భుజంగరాయ శర్మ, పులివర్తి శరభాచార్యులు, వంగవోలు ఆదిశేషశాస్త్రి, పూసలపాటి నాగేశ్వరరావు వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు.
అంగలకుదిటి వారిని ఒక వ్యక్తి అని చెప్పడం కన్నా ఒక వ్యవస్థ అని చెప్పుకుంటే సముచితంగా ఉంటుంది. వీరు మంచి గంధం లాగా చుట్టూరా సుగంధ పరిమళాలను వెదజల్లడమే గాదు కస్తూరి లాగా కలకాలం ఆ సుందర సువాసనలను పంచిపెడుతూనే ఉన్నారు. లలిత మర్యాదస్తులు, పరులలోని గోరంత ప్రతిభను గుర్తించి దానిని వెలికితీసి కొండంత ప్రోత్సాహాన్ని, ప్రాచుర్యాన్ని అందింపగల్గిన వదాన్యశేఖరులు, కారణజన్ములు కూడాను. కొవ్వొత్తి తానవుతూ వెలుగుతూ వెలుతురులను దశదిశలా ప్రసరింపజేస్తూ సంస్కృతికి, సంస్కారానికి, సమన్వయానికి, సృజన శీలతలకు వెలకట్టలేని సుహుృల్లేఖితానవుతూ సుందర శోభితమైన వెలుతురు సెలయేరు, వెలుగురేఖల ఇంద్రధనస్సులా ప్రాచీన ప్రకాశాన తానో ప్రాతః స్మరణీయుడన్న నా వాచనతో అనేకమంది ఏకీభవింపగలరన్న నమ్మకముంది నాకు. యశోధర కావ్యాన్ని వెలుగులోకి తెచ్చిన సందర్భంలో విశ్వనాథ వారి ప్రశంసలు అందుకున్న ఈ సాహితీ రాజపోషకుడు ఎన్నో సాహిత్య, సాంఘిక కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా, సభాధ్యక్షునిగా కొలువు దీరి సభను జనామోదం చేయగల్గిన ప్రతిభామూర్తి వీరు.
ఆంధ్ర విశ్వవిద్యాలయ వయోజన కార్యక్రమాలలో తన కుమార్తె సులోచనా రాణితో పాటు పాల్గొని చీరాల వై.ఎ. ప్రభుత్వ మహిళా కళాశాల తరఫున ఎంతగానో సేవలందింపగలిగారు. తమ ఛారిటీస్ ద్వారా ప్రతి సంవత్సరము ఎందరో పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్పులను అందించేవారు. వారిలో అనేకమంది ఈనాడు అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న అధికారులూ ఉన్నారు. అంగలకుదిటి సుందరాచారి ముర్తిమత్వానికి అరుదైన సందర్భం కీర్తి పురస్కార ప్రదానం. దాతలు అందజేసిన ధర్మనిధిలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము బాలసాహిత్య ప్రక్రియలో వీరి పేరు మీద కీర్తి పురస్కారము ఏటా అందజేస్తోంది. దానికి వీరి తనయ కందేపి రాణీప్రసాద్, అల్లుడు, ప్రముఖ చంటిపిల్లల వైద్యులు అయిన కందేపి ప్రసాదరావు దంపతులు విశ్వవిద్యాలయాన లక్ష రూపాయలతో ధర్మనిధిని ఏర్పాటు చేయడం ముదావహం. అంగలకుదిటి సుందరాచార్య స్మారక బాలసాహిత్య కీర్తి పురస్కారాన్ని తొలిసారి ప్రముఖ బాలసాహితీవేత్త శ్రీ టి. వేదాంతసూరికి అందజేయడం జరిగింది.
వదాన్యశేఖర, అభినవ సమాజభోజ, కవిపోషక బిరుదులలో సత్కరింపబడిన సుందరాచార్యులు సాహిత్యకారులతో బాటు, చిత్రలేఖకులకు కూడ ఎంతగానో ప్రోత్సహించేవారు. మద్రాసు నగర ప్రధాన కూడలి, ఫోరల్ డిజైన్, కంచి కామాక్షీదేవి అమ్మవారు మొదలైన భారీ పెయింటింగులను వేయించి తన బియ్యం మిల్లులను అలంకరింప జేసుకున్నారు. బహుమతులు, అనేక ప్రశంసా ఫలాలను పొందగలిగారు. స్వాతంత్య్ర సమర యోధులకు గుర్తింపుగా ప్రభుత్వం ఇచ్చిన పది ఎకరాల పొలాన్ని మాత్రమే తీసుకొని పించను మాత్రం తిరస్కరించిన విశాల హృదయ సంపన్నుడాయన. కాంగ్రెస్ పార్టీలో చేరి వేటపాలెం కాంగ్రెస్ అధ్యక్షునిగా కొనసాగినా, తన మూలాలను ఏనాడూ విడనాడింది లేదు. శ్రీశైలం, బ్రహ్మంగారి మఠం, చీరాల కంచి కామాక్షీదేవి ఆలయాలలో ప్రత్యేక వసతి సదుపాయాలను ఏర్పాటు చేసి భక్తులకు ఎంతో సహాయం చేయగల్గిన మహనీయుడు అంగలకుదిటి సుందరాచారి. వీరు ఎప్పుడూ తన నడవడికలో క్రియాశీలతను సాధించారే తప్ప హద్దులు దాటింది లేదు. తన చుట్టురా నెలకొని ఉన్న సమాజాన్ని సునాదవినోదినిగా తీర్చిదిద్దగలిగారే తప్ప... మూలాలకు, వాటి తాలూకు సాంప్రదాయాలను ఏనాడు విఘాతం కలిగించలేదు. ఆరోహణే తప్ప అవరోహణలేని జీవితాన్ని వర్ణరంజితంగా, అలంకారమయంగా తీర్చిదిద్దుకోగలిగారు. సంవాదిత్వం ఎరుగనివానిగా, వివాదిత్వానికి వెరవనివానిగా తలవంచని వీరునిగా నెగ్గుకురాగల్గిన అంగలకుదిటి సుందరాచారిది 'సాహితాన' అంగరంగమైన అభినివేశం అనగల్గడం ఏ మాత్రం సత్యదూరం కాబోదు.
-వడలి రాధాకృష్ణ