TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
పార్వతీపురంలో, మా ఇంటి ఎదురుగా రచయిత పంతులజోగారావుగారు ఉండేవారు. ఆనాటికే ఆయన పేరున్న రచయిత. నేనింకా రచనలో ఓనమాలు ఇసుకలో దిద్దుతున్న రోజులవి. ఒకనాడు ఆయన్ని పరిచయంచేసుకుని, కొత్తగా నేను రాసిన కవిత ఒకటి వినిపించాను. విని, నవ్వారాయన.
‘‘ఏదైనా వ్రాయడానికి ముందు చదవడం అలవాటుచేసుకుంటే బాగుంటుంది. నువ్వేం చదివావు?’’ అడిగారు.
ఏమీ చదవలేదన్నాను.
‘‘రా’’ అన్నారు. తోడుకునివెళ్ళి, తనరూంలో ఇనప్పెట్టెలాంటి పుస్తకాల అరలోంచి ఓ పుస్తకం తీసి, ఇచ్చారు.
‘‘ఇది ముందు చదువు. చదివి, నా పుస్తకం నాకు తిరిగిస్తే నీకు మరో పుస్తకం ఇస్తాను. పుస్తకం జాగ్రత్త.’’ అన్నారు.
సరేనని జోగారావుగారిచ్చిన పుస్తకాన్ని భద్రంగా ఇంటికి తెచ్చుకుని తెరిచిచూశాను.
అమృతం కురిసిన రాత్రి
కవితాసంపుటి
దేవరకొండ బాలగంగాధర తిలక్.
పేజీలు తిరగేశాను. ‘నా కవిత్వం’ శీర్షికన తన అక్షరాలు గురించి బలేగా చెప్పుకున్నారాయన.
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు
ఒక్కసారిగా నా శరీరం అంతా చల్లబడిపోయింది. విలవిల్లాడిపోయాను. కాసేపటికి తేరుకున్నాను. అప్పుడనుకున్నాను, ‘ఇదీ కవిత్వం’ అని.
తిలక్ ని నాకు అలా పరిచయంచేశారు జోగారావుగారు.
నాకు తెలిసి, తొలిరోజుల్లో రచయితలంతా కవిత్వాన్నే ఇష్టపడతారు. తర్వాత్తర్వాత వచనం మోజులో పడతారు. అలాగే నేనూ కవిత్వాన్నే ముందు ప్రేమించాను. ఓ అయిదారు కవితలు రాశాను. ఎప్పుడూ కవిగానే బతకాలనుకునేవాణ్ణి.
‘‘కథలు రాస్తూ కూడా కవిగా బతకొచ్చు. వచనంలోకూడా కవిగా బతికినవాడు తిలక్.’’ అన్నారు జోగారావు.
కథలు కూడా తిలక్ రాశారనిచెప్పి, తన దగ్గర ఆ కథల పుస్తకం లేదన్నారు.
తిలక్ కథలు చదవాలి. ఎక్కడ దొరుకుతాయి? పార్వతీపురంలో వెదకనిచోటులేదు. నాకెక్కడా ఆ పుస్తకం దొరకలేదు. అప్పుడెవరోచెప్పారు, విజయనగరం హిమాంశుబుక్ డిపో లో ఉన్నదని.
విజయనగరం వెళ్ళాలి. పుస్తకం తెచ్చుకోవాలి అనుకున్నాను. అనుకున్నానుగానీ, విజయనగరం వెళ్ళడం, పుస్తకం కొనుక్కోవడం ఖర్చుతో కూడుకున్న పని. నావల్ల కాలేదు. చాలారోజులు గడచిపోయాయి.
పార్వతీపురంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసి, నేను విజయనగరం సంస్కృత కాలేజీలో చేరడానికి ముందు, విజయనగరంలో ‘నవయువక్ మిత్రమండలి’ వారి లైబ్రరీలో లైబ్రరేరియన్ గా జాయినయ్యాను. అక్కడా కూడా తిలక్ కథలకోసం వెదికాను. దొరకలేదు.
హిమాంశు బుక్ డిపోలో ఉంది. కనబడేలాపెట్టి తిలక్ కథలు అమ్మజూపుతున్నారు. రెండుమూడుసార్లు ఆ డిపోకి వెళ్ళి పుస్తకం చేతుల్లోకి తీసుకుని, తృప్తిగా నిమిరానే తప్పా, కొనే స్థోమతలేక వెను తిరిగాను. ఆ రోజుల్లో పాతికో, ముప్పయ్యో దాని ఖరీదు.
లైబ్రరేరియన్ గా మొదటి నెల జీతం అందుకున్నాను. అరవై రూపాయలు ఇచ్చారు. అంతే! అక్కణ్ణుంచి ఎకాఎకీన బుక్ డిపోకి చేరుకుని, తిలక్ కథల పుస్తకం కొన్నాను. వర్షం కురుస్తోంది. పుస్తకం తడిసిపోకుండా, దానిని గుండెల్లో పెట్టుకుని పరుగు పరుగున ఇంటికి వెళ్తున్నాను. పారిస్ కార్నర్ దగ్గర చుట్ట తాగుతూ చాసో కనిపించారు.
‘‘ఎక్కడికోయ్’’ అని పలకరించారు.
‘‘ఇంటికి’’ అన్నాను.
‘‘ఓ కాఫీతాగి పోదూగాని, రా’’ అని గుండెల్లో దాస్తున్న దానిని గమనించి,
‘‘ఏంటది?’’ అడిగారు.
‘‘తిలక్ కథలు’’ అన్నాను, చూపించాను.
‘‘కథకుడిగా తిలక్ ఫైలయ్యా! చదువు, నీకే తెలుస్తుంది.’’ అన్నారు. ఎప్పటినుంచో చదవాలని పొంగిపోతున్న నా ఉత్సాహం మీద గుప్పెడు నీళ్ళు గుమ్మరించారు.
‘‘రచయితగా నిలదొక్కుకోవాలంటే చదవడం కన్నా పరిశీలన ముఖ్యఁవయ్యా! కవిత్వంకోసం, కథలకోసం క్షణక్షణాన్నీ పరిశీలించాలి. అవి నీ నిత్యజీవితంలోనే ఉంటాయి. నీ జ్ఞాపకాల్లో ఉంటాయి. నిన్ను ప్రేమించేవారిలో, నిన్ను ద్వేషించేవారిలో, పూలతోటలో, శ్మశానంలో ఎక్కడపడితే అక్కడంతటా ఉంటాయి. బస్టాపుల్లో, రైల్వేస్టేషన్లలో, విమానాశ్రయాల్లో కవిత్వమూ, కథలూ జమిలిగా ప్రయాణిస్తూ కనిపిస్తాయి. పరిశీలించి, నువ్వు పలకరించాలంతే! పలకరిస్తే పరవశించిపోతాయి.’’ అని నవ్వారు.
కాఫీ ఇప్పించారు. సిగరెట్ కూడా ఇచ్చారు.
‘‘కానీ’’ అన్నారు. చుట్ట ఇచ్చారు. సిగరెట్ ముట్టించాను. ఓ గంటసేపు మాట్లాడుకున్నాం.
‘‘ఆధునికత కవిత్వాన్ని చంపేసిందని అంటారుగానీ, నేనొప్పుకోను. సంప్రదాయబద్ధంగా వచ్చిన పద్యాలనూ, పాటలనూ మరచిపోవడం ఎవరితరం? శతాబ్దాలుగా తెలుగునేల కవిత్వాన్ని కౌగలించుకుని ఉంది. ఈ నేలలో వేళ్ళూనిన కవిత్వాన్ని ఎటువంటి ఆధునికతా హానిచెయ్యలేదు. చేసిందని అనుకోవడం పొరపాటు.’’ అన్నారు చాసో.
రాత్రి తొమ్మిదయింది. చాసో ఇంటికి బయల్దేరారు. నేనూ అక్కణ్ణుంచి బయల్దేరి ఇంటికి చేరుకున్నాను. భోజనం చేశానో లేదో గుర్తులేదు. తిలక్ కథలు చదువుతూ కూర్చున్నాను. ఊరిచివరి ఇల్లు, నల్లజెర్లరోడ్డు, ఓడిపోయిన మనిషి, సీతాపతికథ, నిర్మల మొగుడు, దేవుణ్ణి చూసిన వాడు...తిలక్ కథలు చదువుతూ ఉంటే...సముద్రాలకు సముద్రాలే ఇంకుగామారినట్టనిపించింది. రచన పక్షిలాంటిది. దానికి సరిహద్దులులేవనిపించింది. చాసో అభిప్రాయంతో విభేదించాను. తిలక్ కథకుడుగాకూడా పాసే అనుకున్నాను.
తిలక్ కథలూ, కవితలూ కంఠతః పట్టాను. చర్చల్లో, సభల్లో ఎక్కడపడితే అక్కడ అందరికీ వాటిని వినిపింనచడం మొదలెట్టాను. తిలక్ ని తెగ ప్రేమించాను. ఆ ప్రేమతో ‘జ్వాల’ లిఖిత పత్రికను తిలక్ ప్రత్యేక సంచికగా తీర్చిదిద్దాను. ఆ పత్రికను ఓలేటి శ్రీనివాసభాను ముస్తాబుచేస్తే వారి అన్నగారు కీర్తిశేషులు శ్రీ ఓలేటి బుచ్చిబాబుగారు మా ఊరి సీతారామస్వామివారి ఆలయంలో ఆవిష్కరించారు.
నవ్యవార పత్రిక సంపాదక బాధ్యతలు స్వీకరించాక తిలక్ గారి తమ్ముడు శ్రీ దేవరకొండ గంగధరరామారావుగారు మా కార్యాలయానికి ఓసారి వచ్చారు. కబుర్లలోపడ్డప్పుడు అమృతం కురిసిన రాత్రిలోని పద్యాలు నేను అప్పజెబుతూంటే...ఆశ్చర్యపోయారాయన. కళ్ళు చెమర్చుకున్నారు.
‘‘అన్నయ్య బతికి ఉంటే బాగుండేది. మీరిలా అప్పజెబుతోంటే ఆశ్చర్యపోయేవాడు. వచనకవిత్వాన్ని, అందులోనూ తిలక్ కవిత్వాన్ని ఇలా కంఠస్థం చేసిన వ్యక్తిని మిమ్మల్నే చూశాను.’’ అని నన్నెంతగానో మెచ్చుకున్నారాయన.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే...ప్రతివ్యక్తి జ్ఞాపకం, అది వారి ప్రైవేటు సాహిత్యంట! ఎక్కడో ఎప్పడో చదివాను. అందుకు...
-జగన్నాథశర్మ అయలసోమయాజుల