Facebook Twitter
మహిళా మొగ్గలు

మహిళలు సకలరంగాల్లో పాదులు వేస్తేనే
దేశం ప్రగతిపథంలో జండా ఎగురవేస్తుంది
మహిళల ప్రతిభాపాటవాలు ఇలలో అనన్యం

ఆత్మవిశ్వాసంతో అలుపెరుగని సహనంతో
సమస్యలన్నింటిని చక్కదిద్దే  అసమానురాలు
మహిలో మహిమాన్విత శక్తిస్వరూపిణి మహిళ

సమాజ గమనంలో స్త్రీకి గౌరవ స్థానమందిస్తేనే
సామాజిక మనుగడ సుసాధ్యం అవుతుంది
మహిళాభ్యుదయం మహికే వెలుగు

కన్నవారి కలలరూపమై మెట్టినింటి దీపమై
మమకారం పంచే మమతల కోవెల అవుతుంది
అనురాగజల్లులతో ఆశలు చిగురింపచేసేది మహిళ

విధినిర్వహణలో విశేషప్రతిభను చాటుతూ
కీలకరంగాలలో గుర్తింపు పొందుతున్నారు
ప్రతిష్టాత్మక అవార్డుల విజేతలు మహిళలు

అతివలు దృఢసంకల్పమనే ఆత్మవిశ్వాసంతో
ఎన్నెన్నో అవరోధాలను అధిగమిస్తున్నారు
లక్ష్యసాధనలో విజయకేతనం ఎగరవేసేది మహిళలు

మమతానురాగాల మల్లెలసుగంధమై
ఆత్మీయబంధాల సౌరభాలను గుభాళింపజేస్తుంది
మహిళ ఉన్నచోట అవనిలో అంతా వెలుగు

సమస్యలను దరిచేరనివ్వని మనోధైర్యంతో
అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తుంది
మొక్కవోని ఆత్మస్థైర్యానికి నిదర్శనం మహిళ

సామాజిక శరపరంపరలు వేధించినా 
తట్టుకుంటూనే శరవేగంతో ప్రగతిని సాధిస్తున్నారు
మహిళా సాధికారతయే దేశానికి ప్రగతి బాట

అవలీలగా అవకాశాలను అందిపుచ్చుకుని
అంకితభావంతో అద్భుతాలను ఆవిష్కరిస్తోంది
శాస్త్రసాంకేతికరంగాల్లో మహిళ ప్రతిభ అసామాన్యం

మాటలతూటాలు మనసును ముక్కలు చేస్తున్నా
గుండెనిబ్బరంతో ధరణికి ప్రతిరూపమవుతుంది
తరగని త్యాగానికి నిలువెత్తు రూపం తరుణి

ఆవరించిన కటికచీకటిని చీల్చుకుంటూ
మగువ తెగువతో అన్యాయాలను ఎదిరిస్తుంది
సామాజికసంకెళ్ళను చేధించే చైతన్యరూపిణి మహిళ

               

✍ పులి జమున