Facebook Twitter
మాయ నియమించుకున్న సేవకురాలు అజ్ణానం!

అజ్ఞానం ఆనందాన్ని కలిగిస్తుందా? ఒక వేళ అది నిజమే అయితే  ఆ ఆనందం ఎప్పటివరకు నిలుస్తుంది? కృష్ణుడు అర్జునుడి అజ్ఞానాన్ని తొలగించడానికి ఎన్నో విధాలుగా భోదచేస్తాడు. జ్ఞానం అనే కత్తితో నీలో చెలరేగే సందేహములను నరికెయ్యి. అలా నిరుత్సాహంగా కూలబడకు. లే!! ఆయుధం పట్టు. నీవు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మం అయిన యుద్ధం చెయ్యి. నీవు చేసే కర్మ అంటే యుద్ధము నిష్కామంగా ఆచరించు. నీకు బంధనములు అంటవు. ఇదీ పరమాత్మ బోధ. ఎక్కడ చూసినా అజ్ఞానం కర్ర పట్టుకుని పెత్తనం చలాయిస్తూ ఉంటుంది. జ్ఞానం కోసం వెదికే వాళ్లు కూడా అజ్ఞానం వలలో పడి గిలగిల  కొట్టుకుంటూ ఉంటారు. మాయ నియమించుకున్న అత్యంత వినయం కలిగిన సేవకురాలు అజ్ఞానం. అజ్ఞానం నిర్వహిస్తున్న బాధ్యతల తీరు తెన్నులు చూస్తుంటే, శ్రీరాముడిని అడవుల పాలు చేసిన కైకకు సాయం చేసిన కుబ్జ అనే  సేవకురాలు గుర్తుకు వస్తుంది. శిశువును మాయ కప్పేసినట్లు, చెరువులో నీటిని గుర్రపు డెక్క కమ్మేసినట్లు- జ్ఞానాన్ని అజ్ఞానం కనపడకుండా చేస్తోంది... అజ్ఞానమే జ్ఞానం అన్న భ్రమనూ కలిగిస్తోంది. మిడిమిడి జ్ఞానం కూడా అజ్ఞానమే. ఇది చాలా ప్రమాదకరం. అహంకార పూరిత జ్ఞానమూ అజ్ఞానమే. ఇది వినాశనానికి హేతువు.  ఇది అజ్ఞానంలో ఉండి విజ్ఞానం గురించి మాట్లాడుతున్నామని పండితులుగా చలామణీ అయ్యేవారూ తెలుసుకోలేరు. వీళ్లు భగవద్గీత చెప్పిన పండితులు కారు.

అజ్ఞానం కబంధ హస్తాల్లో చిక్కుకుని ప్రపంచమే విలవిల్లాడే పరిస్థితి వస్తూ ఉంటుంది. దీనికి కారణం యుగ ధర్మాలు. కాలం, ప్రకృతి ఈ రెండూ అజ్ఞానం ఆడిస్తున్న నాటకానికి సహకరిస్తూ ఉంటాయి. వీటికి సూత్రధారి మాయ. ఆ మాయ శ్రీకృష్ణుడి అధీనంలో ఉంటుంది. మనం మాయ వశమై ఉంటాం. ఇదొక విష వలయం. అజ్ఞానం ఆనందం కలిగిస్తూ ఉన్నా ఏ పుణ్యాత్ముడికో దీని మోసం బోధపడుతూ ఉంటుంది. అజ్ఞానం పైన విరక్తి కలిగి, జ్ఞానం కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. కాని, అంత తేలిగ్గా అజ్ఞానం పక్కకు తప్పుకోదు. నిన్ను జ్ఞానవంతుడిని చెయ్యడానికి ససేమిరా అంగీకరించదు. జ్ఞానం అంటే సత్యం. ఏది తెలిస్తే,  తరవాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగలదో అదే నిజమైన జ్ఞానం. అజ్ఞానం మధ్యలో బతుకుతుండగా జ్ఞానోదయం కావడమే విచిత్రాల్లోకెల్లా విచిత్రం. అందుకే బుద్ధుడు అంటాడు- ఈ అజ్ఞాన ప్రపంచంలో, బురదలో పద్మంలా వికసించాను అని.

అజ్ఞానం రాజ్యమేలుతూ ఉంటుంది. ఇప్పుడే కాదు. ఎప్పుడైనా... చీకటిలో ఉన్నా,  సూర్యుడి వైపు మొహం తిప్పుకొని వెలుగు మన మీద పడేటట్లు చూసుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను వెలుగులోకి తీసుకు రారు. ఏ స్థితిలోనూ ప్రహ్లాదుడు, తండ్రి అజ్ఞాన ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. హరిని సర్వశక్తిమంతుడిగా తెలుసుకుని, ప్రాణ త్యాగానికీ సిద్ధపడి జ్ఞానానికి మోకరిల్లి చరిత్రలో నిలిచిపోయాడు. చూసేవన్నీ అందంగా ఉంటాయి. ఆకర్షణ కలిగిస్తూ ఉంటాయి. అవన్నీ జ్ఞాన మకరందాలని భావించకూడదు. అందులో మునిగిపోయి అవే జీవన గమ్యంగా తీర్మానించుకోకూడదు. విలాసంగా విచ్చలవిడిగా బతుకుతుంటే... దానికి కారణం అజ్ఞానమని తెలుసుకోవాలి. వినయంగా, నిరాడంబరంగా జీవిస్తుంటే దానికి కారణం జ్ఞానమని గ్రహించాలి. ఏభై ఏళ్లనుంచి చీకటి తాండవిస్తున్న గదిలోకి వెలుగు తీసుకు రావాలంటే,  ఏభై ఏళ్లు పట్టదు. ఒక చిన్న కిటికీ తెరిస్తే చాలు. లేదా చిన్న దీపకళిక వెలిగించినా చాలు.  వెంటనే వెలుగుతో ఇల్లంతా నిండిపోతుంది! మీరు ఒక ఎత్తైన భవంతి మీద నుండి కిందికి పడితే అది చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అజ్ఞానం పరమానందం. కానీ అది మీరు నేలని తాకేంత వరకే, ఆ కొన్ని క్షణాలే. కాబట్టి మూర్ఖులు ఆనందంగా ఉండగలరు. కానీ, అది జీవితం వారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పట్టనంత వరకే, సాధారణంగా జీవితం వారిని ఇబ్బంది పెడుతుంది. ఒక వేళ జీవితం వారిని ఇబ్బంది పెట్టకపోతే, మరణం తప్పకుండా ఇబ్బంది పెడుతుంది.
అజ్ఞానము వలన పుట్టేవి ఏమిటి అంటే సంశయాలు, మోహము, మొదలైనవి అజ్ఞానం నుండి పుడతాయి. మనలో ఉన్న సకల దుర్గుణములు, అనుమానాలు, దుష్టసంకల్పాలకు మూలము మనలో ఉన్న అజ్ఞానమే.

అజ్ఞానము అంటే ప్రతిదానినీ దాని వాస్తవిక స్వరూపంతో కాకుండా మనం అనుకున్నట్టు మనకు అనుకూలంగా అర్థం చేసుకోవడం. అంటే నిజాన్ని తెలుసుకోకుండా మన బుర్రలో ఉన్న ఆలోచనల ప్రకారం ఎదుటి దాన్ని నిర్ణయించడం. ఎలా అంటే అన్నీ మనకు అనుకూలం అవుతాయని భ్రమపడటం. అన్నీ మనకే కావాలని అనుకోవడం. అన్నిటికీ నేనే మూలం నావలననే జరుగుతున్నాయి. అని భావించడం. "జ్ఞానాసినా” అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానము అనే కత్తితో నరికెయ్యాలి. అంటే జ్ఞానము కత్తి లాంటిది. అది అజ్ఞానాన్ని కోసేస్తుంది. చీకటి పోవాలంటే వెలుగు రావాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానము అనే కత్తి కావాలి.

"హృతమ్" అంటే ఈ అజ్ఞానము, అనుమానాలు, మోహము ఇవన్నీ ఉండే స్థావరము. స్థావరం అంటే నివాసం. ఈ అజ్ఞానం నివాసం ఎక్కడ అంటే అది మన హృదయమే దానినే మనసు, చిత్తము అని కూడా అంటారు. మన శత్రువులు ఎక్కడో లేరు మనలోనే ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. మనం చేసే పొరపాట్లకు ఇతరులను నిందించేకంటే మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. హృదయములో తిష్టవేసుకొని ఉన్న అజ్ఞానాన్ని అనుమానాలని మనమే నివృత్తి చేసుకోవాలి కానీ మరొకరు నివృత్తి చేయలేరు. ఎలాగంటే మన నెత్తిమీద బరువును మరొకరు దించగలరు. మన అప్పు మరొకరు తీర్చగలరు. కాని మన కడుపులో ఉన్న ఆకలిని మనమే తీర్చుకోవాలి. మరొకరు తింటే మన ఆకలి తీరదు. అలాగే మన హదయంలో ఉన్న అజ్ఞానాన్ని, అనుమానాలని మనమే నివృత్తి చేసుకోవాలి. దానికి జ్ఞానం సంపాదించాలి. అందుకే ప్రతి మనిషికి జ్ఞానం ఎంతో ముఖ్యమైనది అని నొక్కి వక్కాణిస్తున్నది. 

ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి "యోగమతిష్ట" అంటే యోగమును ఆచరించాలి. అంటే నిష్కామ కర్మ యోగమును అవలంబించాలి. మనలో ఉన్న అజ్ఞానం, సందేహములు పోవడానికీ, జ్ఞానం రావడానికీ, అవసరమైనది నిష్కామ కర్మయోగము. ఎటువంటి సంగము అంటే ఎలాంటి స్వలాభాపేక్ష కానీ ఏదో ఒకటి ఆశించినట్టు కాకుండా నిస్వార్థంగా, కర్ఘృత్వభావన లేకుండా, ఏకాగ్రచిత్తంతో అంటే పని మీద మాత్రమే మనసు పెట్టి కర్మలు చేయడం. వీటిని ఆచరిస్తే ఎటువంటి కర్మబంధనములు అంటవు. అంటే ఆ పని తాలూకూ పాపం, పుణ్యం అనేవి మనిషిని వెంటాడవు.

అందుకే ఓ అర్జునా! నేను యుద్ధం చేస్తే నా చేతుల్లో వీళ్లంతా మరణిస్తారు. వర్ణ సంకరం అవుతుంది. ఆ పాపం నేను భరించలేను. అందుకని నేను యుద్ధం చేయను. సన్యాసం తీసుకుంటాను, భిక్షాటన చేసి జీవిస్తాను. ఈ రక్తపు కూడు తినలేను అనే పనికిమాలిన మాటలు కట్టిపెట్టి 'ఉత్తిష్ఠ' అంటే లే, ఆయుధం పట్టు, నిష్కామంగా, కర్తృత్వభావన లేకుండా యుద్ధం చెయ్యి ఫలితాన్ని పరమాత్మకు వదిలిపెట్టు అని ప్రబోధించాడు కృష్ణుడు. ఇదే ప్రతి మనిషి తను చేసే పనికి అన్వయించుకోవాలి అప్పుడు అలా చేసిన మనిషికి  ఆ కర్మ తాలూకూ ఫలాలు జన్మజన్మనూ వెంబడించవు.