అండగా ఉన్నాం... భయం వీడి పోరాడండి.
కూలిపోతున్నారు
కాలిపోతున్నారు
కరాళ కరోనా వైరస్
నిత్య కృత్య విశృంఖల దాడిలో...
కాటికి పోతున్నారు
కనుమరుగవుతున్నారు
"కూలిపోతున్నారు"
సమాజ హితం కొరకు
రచనలు చేసిన కవులు
జనం కొరకు జగతి కొరకు
పని చేసిన కళాకారులు
యదార్థ సంఘటనలను
కళ్ళకు కట్టిన జర్నలిస్టులు
"కూలిపోతున్నారు"
రోగపీడితులకు భరోసా
కళ్ళెదుట నిలచిన వైద్యులు
కంటికి రెప్పలా కాచే
వైద్య సహాయకులు
శాంతి భద్రతలను కాపాడే
పోలీసు సహోదరులు
"కూలిపోతున్నారు"
మనసులు తెలిసి మసలే
ప్రియతమ మిత్రులు
సన్నిహితంగా పనిచేసిన
సహచర ఉద్యోగులు
జీవన యానంలో కలిసే
జీవిత పథగాములు
"కూలిపోతున్నారు "
సహచరులను కోల్పోయిన
యువతీయువకులు
చేతులలో వాలుతున్న
రక్తం పంచిన బిడ్డలు
నిస్సహాయులుగా మారి
చేస్తున్న ఆక్రందనలు
"కూలిపోతున్నారు"
ఎప్పుడు ఏ దారుణం
వినవలసి వస్తుందోనని
ఊపిరి బిగబట్టి
మనసును చిక్కబట్టి
కుమిలి కమిలి పోతున్న
మన తోటి మానవులు
"కూలిపోతున్నారు"
కళ్ళెదుట జరుగుతున్న
మానవ మారణ హసనం
ఓదార్పుకు నోచుకోని
దిక్కులేని దీనజనం
అండగా మేమున్నాం
భయం వీడి పోరాడండి.
"కూలిపోతున్నారు"
