
దహనమౌతున్న కలలు
అనుక్షణం రగులుతున్న ఆశలు
నిప్పులసెగలు గక్కుతున్నయ్
రహస్యమేమిలేదనుకున్నా
రంగులుమారుతున్న కాలమిది
ఇంతలా ఉరిమి ఉరిమి పూరిగుడెసెలపై పిడుగులు
ఊరి పొలిమేరలు దాటిన మహమ్మారి
ఊపిరాడకుండా చేసి ఊరుదాటిస్తుంది
ఊగుతూ తూలిపడుతున్న శవాల గుట్టలు
హెచ్చరించినా ఎదకు చేరలేదు
ప్రజలకు పాలితులకు
ముందుచూపులేక బలైతున్న బతుకులు
గాలి కరువై తనువు బారమై
అణువణువునా డొల్లతనం
పేదోలందరు శవాలదిబ్బలైతున్న దృశ్యం
ఆసుపత్రిలో పడకలసలే లేవు
ప్రాణవాయువుకు కరువొచ్చే
నేతలంతా ఎక్కడిదొంగలక్కడే
పట్టపగలు నట్టనడివీదిలో పిట్టల్లా రాలుతున్న సామాన్యులు
ఈ సమయంలో ఎవరికెవరు కాపలా??
దిక్కుతోచని దీనస్థితి
ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులెందుకుండవో?
చేతకాని నేతలకు ముందుచూపులేకనే జరుగుతున్న మరణమృదంగమిది
అసలు ప్రజలను రక్షించేదెవరో?
స్వాతంత్ర్య భారతానికి ఎన్నాళ్లీ పరిస్థితి?
ఎన్ని తరాలిలా రాలే సమిధలౌతారో?
ఇప్పుడిదో కొత్త ప్రపంచం
అర్థంకాని రసాయనశాలైంది
కట్టండి కట్టండి సామాన్యులకు ఆసుపత్రులను
కరోనా వంతెన దాటేందుకు
కన్నీళ్ల జీవనం ముగిసేందుకు
ఎప్పుడు ఎవరో ఒకరు
ఉన్నట్టుండి తప్పపోతున్న తరుణమిది!!
.jpg)
సి. శేఖర్(సియస్సార్)



