Facebook Twitter
చెమట చుక్కలు

పనిచేసే మనుషులు పిడికిలెత్తి ఒక్కటైన రోజు
పనికింత సమయమంటూ తమకు హక్కులుంటాయని
పనికి విలువ వచ్చిన రోజు
దోపిడిదారుల కోరలను పీకేసిన రోజు
పెట్టుబడిదారుల మోసం తేటతెల్లం చేసిన రోజు
చెమటచుక్కలన్ని ఆకాశంలో పరచుకున్నట్టు
శ్రమజీవులంతా ఐక్యతమత్మ్యం చూపిన రోజు
కర్షకవీరులలో పారే రుధిరం ఎర్రజెండాగా మారి 
కార్మికుల ఐక్యతకు నాంది పలికిన రోజు
కార్మికుల సంక్షేమం విశ్వమంతా వికసించినరోజు

మరేమిటో ఇప్పుడు
నా దేశంలో
శ్రమజీవులంతా ఏకమై
నేతలు ఉన్నతులకోసం చేసిన
చట్టాలను వ్యతిరేకిస్తూ
ఉద్యమం చేస్తే  
కపటబుద్దిని బట్టబయలు చేసిన ప్రభుత్వం
అణిచివేతతో హక్కులు కాలరాజేస్తున్నా కాలమిది
ప్రశ్నించినోడిక్కడ దేశద్రోహి

ఆనాడెపుడో మే డే అంటూ సమ్మెహక్కు సాదించారు
ఈనాడేమో కష్టజీవులను అణిచివేస్తూ కటకటాల్లోకి తోసేస్తున్నరు
సామాన్యులకేంకావాలో ప్రభుత్వానికి పట్టదాయే
పెట్టుబడిదారుడే వారికి నిత్యదైవమాయే
నాయకులంతా వారి చెప్పుచేతుల్లో బందిలైరి
తిరోగమనం వైపు అడుగులు
కార్మికుల ఉద్యమమేదో ఉగ్రరూపం దాలుస్తున్నట్టు
ఆకలికేకల పిడికిల్లన్ని ఒక్కటైతై..

 

సి. శేఖర్(సియస్సార్)