ఏపీలో అబద్దాల దినం..
Publish Date:Nov 22, 2018
Advertisement
గత ఎనిమిదేళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు తమ ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నారు. చంద్రబాబు ఆస్తులు ప్రకటించే రోజును ఏపీ అబద్ధాల దినంగా పెట్టాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఏడీఆర్ అనే సంస్థ సర్వే చేసి దేశంలో అత్యంత ధనవంతుడైన సీఎంగా చంద్రబాబును ప్రకటించిందని గుర్తు చేశారు. లోకేష్ 2017లో ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా అఫిడవిట్‌లో రూ.330.14కోట్లు ఆస్తులుగా చూపారని, ఇప్పుడు మాత్రం 26.39కోట్లుగా చూపిస్తున్నారన్నారు. ఇంత తేడా ఎలా వచ్చిందో లోకేష్ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మనువడు దేవాన్ష్ ఆస్తులు గత ఏడాది రూ.11.54కోట్లు అయితే .. ఈ ఏడాది రూ. 15.74కోట్లుగా ఎలా అయిందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వేల కోట్లతో నిర్మించుకున్న చంద్రబాబు నివాసాన్ని కేవలం రూ. 18కోట్లుగా మాత్రమే చూపారని విమర్శించారు. అంతేకాకుండా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోవటంపై కూడా స్పందించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేతుల్లో నలిగిపోతున్న ఆంధ్ర ప్రదేశ్ పైనే తమ పార్టీ దృష్టి పెట్టిందని,అందుకే తెలంగాణలో పోటీ చేయడం లేదని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబును ఓడించి ఏపీ ప్రజలను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యం అన్నారు. తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదని చంద్రబాబు, రఘువీరాలు ప్రశ్నించడం అర్దరహితం అన్నారు. తెలంగాణలో పోటీ చేయడం లేదని గతంలోనే తమ పార్టీ ప్రకటించిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో తెలంగాణపై తమ పార్టీ దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/ysrcp-leader-ambati-rambabu-comments-on-chandrababu-and-family-assets-39-84505.html





