కడప వీధుల్లో షర్మిల వర్సెస్ భారతి
Publish Date:Apr 29, 2024
Advertisement
వైసీపీకి కంచుకోట అయిన కడపలో ఆ పార్టీ ఆధిపత్యానికి బీటలు వారుతున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వాస్తవానికి కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఆ జిల్లాలో ఇప్పటి వరకూ ఆ కుటుంబానికి ఎదురన్నదే లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆ కుటుంబానికి జిల్లాపై అలాంటి సాధికారత లేకుండా పోయింది. అందుకు ప్రధాన కారణం ఇప్పుడా కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయి ఆధిపత్యం కోసం పరస్పరం పోటీ పడటమే. ఔను కడప జిల్లాలో ఇప్పుడు వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయి ఆధిపత్యం కోసం పోరాడుతోంది. గత ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలోకి రావడం కోసం, జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం కుటుంబం మొత్తం ఐక్యంగా నిలబడింది. జిల్లాలో ఫలితాలు అందుకు తగ్గట్టుగానే వచ్చాయి. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐదేళ్ల కిందట జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితులు వైఎస్ కుటుంబీకులే కావడం, ఆ అంశంపైనే కుటుంబం రెండుగా చీలిపోవడంతో జిల్లాలో పరిస్థితి తారుమారైంది. జగన్ అధకారంలోకి వచ్చిన తరువాత చెల్లెలు షర్మిల అన్నతో విభేదించింది. న్యాయంగా తనకు రావలసిన కుటుంబ ఆస్తులను ఇవ్వకపోవడమే కాకుండా పార్టీలో తన ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించి, చవరకు పార్టీ నుంచే సాగనంపిన జగన్ కు వ్యతిరేకంగా ఆమె గళమెత్తారు. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులను జగన్ వెనకేసుకు వస్తున్నారని ఆరోపిస్తూ, వివేకా కుమార్తె డాక్టర్ సునీత చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించి, ఆమెకు బాసటగా నిలిచారు. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా కడప లోక్ సభ స్థానం నుంచి పోటీలో ఉంటే.. వైఎస్ షర్మిల అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో నిలిచారు. ఇక ఇదే లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్ పోటీ చేస్తున్నారు. తన భర్తకు మద్దతుగా వైఎస్ భారతి పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. కడప లోక్ సభ అభ్యర్థిగా రంగంలో ఉన్న షర్మిల ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. నేరుగా జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో కడప వీధుల్లో వైఎస్ భారతి, వైఎస్ షర్మిల రాజకీయ పోరాటం రాష్ట్ర రాజకీయాల్లోనే హైలైట్ గా నిలవనుంది. ఇప్పటి వరకూ అయితే వైఎస్ భారతి వ్యూహాత్మకంగా షర్మిలపై నేరుగా ఎటువంటి విమర్శలూ చేయకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే షర్మిల మాత్రం భారతిపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వైఎస్ భారతి కూడా షర్మిలపై డైరెక్టుగా విమర్శలు సంధించడానికి ఎక్కవ రోజులు తీసుకునే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. దీంతో తొలిసారిగా వైఎస్ కుటుంబ కోటకు బీటలువారిన సంకేతాలు కనిపిస్తున్నాయి. కడప ఫలితమే నిజమైన వైఎస్ రాజకీయవారసులెవరన్నది తేలుస్తుందని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/ysr-family-fight-on-kadapa-roads-25-174730.html