జై కొట్టినా, నో చెప్పినా పదవులకు గండమే.. జగన్ కింకర్తవ్యం.!
Publish Date:Jul 18, 2026
Advertisement
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్టసభల్లో నేరస్తుల సంఖ్యను తగ్గించేందుకు, రాజకీయాల్లో పారదర్శకతను పెంచేందుకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. చట్టసభల ప్రతినిధులు ఎవరైనా సరే ఏవైనా కేసులలో 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష అనుభవిస్తే లేదా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంటే వారి పదవి తక్షణమే రద్దయ్యేలా ప్రతిపాదనai సిద్ధం చేస్తోంది. ఈ కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా మెజారిటీ రాజకీయ పక్షాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ కొత్త చట్టంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించనున్న ఈ అనర్హత బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదని.. అవసరమైతే పార్లమెంట్‌లో వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ ఎంపీలకు జగన్ దిశా నిర్దేశం చేసినట్లు వైసీపీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వారి నుంచి మొదలుకొని సాధారణ శాసనసభ్యుడి వరకు ఎవరైనా సరే ఒక నెల రోజుల పాటు జైలులో గడపాల్సి వస్తే వారి పదవి ఊడిపోయేలా కేంద్రం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావాలని యోచిస్తోంది. అయితే ఈ నిబంధన ప్రకారం జైలు నుంచి విడుదలైన తర్వాత సదరు నాయకులు తిరిగి తమ పదవులను పొందేందుకు వీలుంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు. గతంలో పార్లమెంట్‌లో తగినంత బలం లేకపోవడం వల్ల ఈ బిల్లు విషయంలో ముందడుగు వేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ సాహసించలేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటులో తగినంత సంఖ్యా బలం ఉండటంతో, ఈ బిల్లును తీసుకురావాలని మోడీ సర్కార్ భావిస్తున్నదని అంటున్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎన్నో వివాదాస్పద బిల్లులకు, కీలక చట్టాలకు వైసీపీ బేషరతుగా మద్దతు ఇస్తూ వచ్చింది. ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామి కాకపోయినప్పటికీ, జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల అంటూ మోదీ ప్రభుత్వ నిర్ణయాలకు జగన్ జై కొట్టారు. అలాంటిది ఇప్పుడు అకస్మాత్తుగా కేంద్రం తెస్తున్న ఈ అనర్హత బిల్లును వైసీపీ వ్యతిరేకించాలని నిర్ణయించుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీ తీసుకున్న ఈ యూటర్న్ వెనుక ఆ పార్టీ అగ్రనాయకత్వానికి ఉన్న వ్యక్తిగత, రాజకీయ భయాలే ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ దాఖలు చేసిన అక్రమ ఆస్తుల కేసులు విచారణలు ప్రస్తుతం న్యాయస్థానాలలో తుది దశకు చేరుకున్నాయి. గతంలో ఈ కేసుల దర్యాప్తు నేపథ్యంలో జగన్ దాదాపు 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. దీనికి తోడు.. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన వివిధ రకాల అక్రమాలు, అవినీతి ఆరోపణలపై విచారణలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జగన్ లేదా, అత్యంత సన్నిహితులైన నేతలు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఈ 30 రోజుల అనర్హత చట్టం గనుక అమల్లోకి వస్తే, భవిష్యత్తులో జగన్ ఎదుర్కొంటున్న కేసుల కారణంగా ఆయన మళ్లీ ఒక నెల రోజుల పాటు జైలుకు వెళ్లాల్సి వస్తే.. ఆయన శాసనసభ సభ్యత్వంతో పాటు పార్టీ ఉనికి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ తరహా చట్టపరమైన ఇబ్బందుల నుంచి తమ అధినేత, పార్టీ భవిష్యత్తు రక్షించుకోవడానికే వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఒకవేళ దేశంలో అవినీతి రహిత రాజకీయాల కోసం కేంద్రం పట్టుబడితే, ఈ చట్టాన్ని అడ్డుకోవడం ప్రాంతీయ పార్టీలకు అంత సులువు కాదని అంటున్నారు. ఒకవేళ కేంద్ర పెద్దల నుంచి ఒత్తిడి పెరిగితే లేదా రాజకీయ వ్యూహాల్లో మార్పులు జరిగితే, ఓటింగ్ సమయంలో వైసీపీ కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, రాజకీయాల్లో నైతికతను పెంచేందుకు కేంద్రం తెస్తున్న ఈ ప్రతిపాదనపై వైసీపీ తీసుకున్న ఈ వెనకడుగు వ్యవహారం రానున్న రోజుల్లో మరింత రాజకీయ వేడిని పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ బిల్లు విషయంలో జగన్ పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యి చందంగా మారిందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. బిల్లుకు జై కొట్టినా, బిల్లును వ్యతిరేకించినా కూడా జగన్ జైలు, పదవుల గండం ఉందని అంటున్నారు. YS Jagan Mohan Reddy, YSRCP BJP Bill, 30 Days Jail Disqualification Bill, 130th Constitutional Amendment, Andhra Pradesh Politics
http://www.teluguone.com/news/content/ys-jagan-mohan-reddy-45-226381.html




