రోజాకు షాక్ ఇచ్చిన జగన్ ..ప్రత్యర్థి వర్గానికి కార్పొరేషన్ పదవి
Publish Date:Oct 1, 2020
Advertisement
ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజాకి వైసీపీలో పవర్ తగ్గిపోతోందా?.. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా, ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలోనే పవర్ చూపించలేకపోతున్నారా?.. పార్టీలోనూ, నియోజకవర్గంలోనూ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రోజా వ్యతిరేక వర్గానికి చెందిన కేజే శాంతికి రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ పదవి ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పెద్దిరెడ్డి చొరవతో కేజే కుటుంబానికి పదవి దక్కినట్టు ప్రచారం జరుగుతోంది. నగరిలో గత కొంత కాలంగా ఎమ్మెల్యే రోజాకు, మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ వర్గాల మధ్య విభేదాలున్నాయి. గతంలో కేజే అనుచరులు అనేక సందర్భాల్లో రోజాను అడ్డుకున్నారు. కెబిఆర్ పురం గ్రామ సచివాలయం భూమి పూజకి వెళ్ళిన సమయంలో గ్రామంలోకి ప్రవేశించకుండా కేజే అనుచరులు ఆమెను అడ్డుకొని, కారు అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు రోజా వారిపై ఫిర్యాదు కూడా చేశారు. అంతేకాదు, గతంలో కేజే కుమార్ ఇంట్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు ఎవరూ హాజరుకావొద్దంటూ.. అప్పట్లో ఆమె పార్టీ కార్యకర్తలకు పంపిన ఆడియో సందేశం వైసీపీలో కలకలం రేపింది. అయితే, పార్టీ శ్రేణులు ఎవరూ హాజరుకావొద్దని రోజా కోరగా.. ఆ కార్యక్రమానికి ఏకంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు హాజరయ్యారు. ఇక, ఈ ఏడాది మే నెలలో పుత్తూరులో కళ్యాణ మండపం నిర్మాణం కోసం డిప్యూటీ సీఎం నారాయణస్వామి అధికారులతో స్థలాన్ని పరిశీలించారు. అయితే, తన నియోజకవర్గంలో స్థలాన్ని పరిశీలించడానికి వస్తూ తనకు కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై రోజా అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఈ ఏడాది కాలంలో అనేకసార్లు రోజా మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఒకవైపు తన వైరి వర్గానికి మద్దతుగా నిలుస్తూ, మరోవైపు తనకి తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా నియోజకవర్గ ప్రజల్లో తనను పలుచన చేస్తున్నారన్న అసహనం రోజాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కూడా కేజే కుమార్ భార్య శాంతికి రాష్ట్ర కార్పొరేషన్ పదవిని కట్టబెట్టడంపై రోజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులు కావాలని తన వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ పెద్దిరెడ్డి, నారాయణస్వామిలపై రోజా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. వైసీపీ అధికారలోకి వస్తే తనకి మంత్రి పదవి దక్కుతుందని రోజా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమె ఆశలపై జగన్ నీళ్ళు చల్లారు. ఆమెని కాదని పెద్దిరెడ్డి, నారాయణస్వామిలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో రోజా అప్పట్లో తీవ్ర అసంతృప్తికి లోనై కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు. చివరికి కంటితుడుపు చర్యగా ఆమెకి ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయితే, ఆ పదవితో ఆమె సంతృప్తిగా లేరని తెలుస్తోంది. దీనికితోడు పెద్దిరెడ్డి, నారాయణస్వామి మద్దతుతో వైరి వర్గం రోజురోజుకి బలపడుతుండటం, ఆమె నియోజకవర్గంపై పట్టు కోల్పోతుండటంతో తీవ్ర అసహనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం మంత్రుల పెత్తనాన్ని భరిస్తూ వచ్చిన రోజా.. ఇప్పుడు కేజే కుమార్ భార్య శాంతికి రాష్ట్ర కార్పొరేషన్ పదవిని కట్టబెట్టడంతో ఇక తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటున్నారట. అవసరమైతే ఈ విషయంపై జగన్ తోనే తేల్చుకోవాలని రోజా అనుకుంటున్నారని సమాచారం. దీంతో ఈ విషయంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి రాజకీయవర్గాలలో నెలకొంది.
http://www.teluguone.com/news/content/ys-jagan-gives-big-shock-to-mla-roja-25-104659.html





