పులివెందుల ఎన్నికలు రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలి.. జగన్ సంచలన డిమాండ్.!
Publish Date:Nov 1, 2026
Advertisement
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఆయన.. పోలింగ్ కేంద్రాల వద్ద నెలకొన్న పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. ఎన్నికలను రద్దు చేసి, తిరిగి పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. పులివెందులలో తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి అనుమతించడం లేదని జగన్ ఆరోపించారు. తనకు ఓటు ఉన్న పోలింగ్ కేంద్రంలో మాత్రమే ఏజెంట్లను అనుమతించారని, మిగిలిన 70 పోలింగ్ బూత్‌లలో తమ ఏజెంట్లకు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చించినట్లు తెలిపారు. చైర్పర్సన్ అభ్యర్థిపై దాడి చేశారని, మీడియా ప్రతినిధులపైనా దాడులకు పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. ఓటర్లను అడ్డుకోవడంతో పాటు, వారి ఓటర్ స్లిప్పులను చించివేస్తున్నారని విమర్శించారు. పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ.. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు తొలుత అనుమతి నిరాకరించారని, తప్పనిసరి పరిస్థితుల్లోనే హెలికాప్టర్ ల్యాండ్ అయిందని జగన్ తెలిపారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాక్రోచ్లు, మావోయిస్టులు పుట్టుకొస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. పులివెందుల పోలింగ్‌లో జరిగినట్లు తాము చెబుతున్న అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. [ YS Jagan, Pulivendula Elections, Repolling Demand, Election Irregularities, Supreme Court, Andhra Pradesh Politics, State Election Commission, Polling Booths ]
http://www.teluguone.com/news/content/ys-jagan-25-235996.html




