జగన్ మారకుంటే మన గతి ఏమిటి.. వైసీపీ నేతల అంతర్మధనం..!
Publish Date:Aug 1, 2026
Advertisement
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు. జగన్ మాటలు, ప్రకటనలు ప్రజలలో పార్టీని చులకన చేస్తున్నాయని ఆవేదన..ప్రభుత్వ వ్యతిరేకతను మించి జగన్ మీద అపనమ్మకం ప్రజలను ప్రభావితం చేస్తుందనే భయం...రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. కూటమి ప్రభుత్వం మీద ప్రజలలో ఎంత మాత్రం సంతృప్తి లేదని అందరికీ అర్ధమైపోయింది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆ నిజం ఒప్పుకొంటున్నారు. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కొంటున్నామన్న నిర్వేదం వారిని ఆవహించి వుంది. పరిస్థితి ఇట్లనే వుంటే రేపటి ఎన్నికలలో నెగ్గుక రావడం దుర్లభం అన్న భయం కూడా వారిని కలత పెడుతున్నది. చాలామంది ఎమ్మెల్యేలు ఈ భయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవడానికి వైసీపీ ఎంత మాత్రం సన్నద్ధం కాలేకపోతున్నది. జిల్లా స్థాయి నాయకులు కొందరు మాత్రమే భవిష్యత్ మీద ఆశతో కొంత చురుకుగా కనిపిస్తున్నారు. కానీ కార్యకర్తలలో ఆ ఉత్సాహం, విశ్వాసం కనిపించడం లేదు. మూడు పార్టీల కూటమి, రెండు ప్రధాన కులాల కలయిక కొనసాగినంత కాలం మనమెట్లా గెలుస్తామనే నిరాశ కార్యకర్తలలో కనిపిస్తున్నది. రాజకీయ చర్చలు ఆ కోణంలోనే కొనసాగుతున్నాయి. పైస్థాయి నాయకులు మాత్రం, జగన్ ధోరణి చూసి బాధ పడిపోతున్నారు. ప్రజలలో వున్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడానికి పార్టీ అధినేతగా జగన్ సరైన రీతిలో స్పందించడం లేదన్నది వారి అభిప్రాయం. గత పాలనలో జరిగిన పొరపాట్లు లేదా మహా పాపాల వల్ల తాము ఓడిపోయామని, మళ్లీ అధికారం వస్తే ఆ పొరపాట్లు జరగకుండా చూసుకుంటామనే విశ్వాసాన్ని ప్రజలలో కలిగించడానికి జగన్ ఎంత మాత్రం ప్రయత్నం చేయడం లేదు. జమీన్ రైతు సౌజన్యంతో...!
http://www.teluguone.com/news/content/ys-jagan-25-227708.html




