ముద్రగడ పద్మనాభంతో అంబటి భేటీ
Publish Date:Mar 26, 2026
Advertisement
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మద్రగడ పద్మనాభరెడ్డితో భేటీ అయ్యారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం కిర్లంపూడి చేరుకున్న అంబటి నేరుగా ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై వారిరువురూ చర్చించారని తెలుస్తోంది. భేటీ అనంతరం అంబటి రాంబాబు ముద్రగడపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పట్టుదల, రాజకీయాలలో నిజాయితీ, విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుతించారు. తమ మధ్య జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఈ సందర్భంగా అంబటి విమర్శలు గుప్పించారు. గతంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పోలీసులు ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశారో అలాగే ఇప్పుడు వైసీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీరును తప్పుపట్టిన అంబటి రాంబాబు.. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు తగ్గేదేలే అంటూ పుష్పసినిమా స్టైల్ లో చెప్పారు. వైఎస్సార్సీపీ తరపున, తన సామాజికవర్గం తరపున పోరాడుతూనే ఉంటానన్నారు. ప్రభుత్వ అణిచివేత ధోరణిని ప్రజలంతా గమనిస్తున్నారని అంబటి రాంబాబు చెప్పారు.
http://www.teluguone.com/news/content/ycp-senior-leader-ambati-meet-mudragada-25-216243.html





