చీలిక అంచున వైసీపీ.. అమరావతిపై జగన్ వైఖరే కారణమా?
Publish Date:Mar 31, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశం అమరావతి. ఈ విషయంలో వైఎసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరి ఇప్పుడు ఆ పార్టీ నేతలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిన తరువాత.. వైసీపీలో అంతర్మథనం మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ హయాంలో అప్పటికే జోరుగా నిర్మాణమౌతున్న అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అంటూ ఆరంభించిన మూడుముక్కలాట కారణంగానే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చిందన్న అభిప్రాయం అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఘోర ఓటమి తరువాత కూడా అమరావతి విషయంలో మాజీ సీఎం జగన్ వైఖరి మారకపోవడం వచ్చే ఎన్నికలలో అంటే 2029 ఎన్నికలలో పార్టీకి మరింత నష్టం చేకూర్చడం ఖాయమని పలువురు వైసీపీ నేతలు వాపోతున్నారట. అన్నిటికీ మించి తాజాగా అసెంబ్లీలో అమరావతిపై చర్చకు వైసీపీ గైర్హాజర్ పట్ల కూడా పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందంటున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఇక ప్రజలకు తాము ముఖం చూపించగలిగే పరిస్థితి లేదని వాపోతున్నారంటున్నారు. తమ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరవమంటే కప్పకు, వద్దంటే పాముకు కోపం అన్న చందంగా.. అమరావతికి అనుకూలంగా మాట్లాడితే అధినేతకు కోపం, వ్యతిరేకంగా ఉంటే ప్రజల నుంచి ఛీత్కారం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ అమరావతిపై వ్యతిరేకత మానుకోకుంటే పార్టీ మనుగడ కష్టమేనన్న అభిప్రాయం వైసీపీయులలో వ్యక్తం అవుతోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించి, దానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తున్నది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వచ్చే నెల మొదటి తేదీనే లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో జగన్ తన అమరావతి వ్యతిరేకతను పట్టుకుని వేలాడితే మొదటికే మోసం తప్పదని మెజారిటీ వైసీపీయులు గట్టిగా భావిస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి విషయంలో జగన్ వైఖరి మారకుంటే రానున్న రోజులలో కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక మెజారిటీ వైసీపీయులు అయితే.. ఈ అంశంలో జగన్ వైఖరి మారకుంటే పార్టీలో భారీ చీలిక అనివార్యమని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-on-the-brink-of-a-split-25-216464.html




