ఆర్టికల్ 356ని కొని తెచ్చుకోవద్దు.. రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు
Publish Date:Jul 24, 2020
Advertisement
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే శుక్రవారంలోగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ను ఉద్దేశించి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థతో చీవాట్లు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అనవసరంగా న్యాయవ్యవస్థలతో పెట్టుకుని ఆర్టికల్ 356ని కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. కోర్టులకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. మనది రాచరిక వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్య దేశమని.. న్యాయ వ్యవస్థలను, కోర్టులను గౌరవిద్దామని చెప్పారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవించి ఎస్ఈసీగా నిమ్మగడ్డను తిరిగి నియమించాలని కోరారు. కోర్టు తీర్పు మేరకు నిమ్మగడ్డను నియమిస్తే తప్పేముందని ప్రశ్నించారు. గవర్నర్ మాట వినలేదు.. కనీసం సుప్రీంకోర్టు తీర్పునైనా గౌరవించండి అని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం సరైనదని.. కరోనా మహమ్మారి నుంచి ఆ నిర్ణయం ప్రజలను కాపాడిందని చెప్పారు. తాను సలహా ఇస్తే స్వీకరించరు. సలహాదారులు బోలెడంత మంది ఉన్నా.. వారేమో సరైన సలహాలు ఇవ్వరని ఎద్దేవా చేశారు. చెప్పుడు మాటలు విని ముఖ్యమంత్రి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడమే తన తప్పైపోయిందని వ్యాఖ్యానించారు. 22 మంది ఎంపీలను మీకు అప్పగిస్తాం.. రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఢిల్లీకి వచ్చి వేడుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం మీద అవగాహన లేని కొంతమంది చేసే ఫిర్యాదులతో తనకు ఏమీ కాదని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి గొంతును నొక్కే ప్రయత్నం చేయవద్దని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/ycp-mp-raghu-rama-krishna-raju-shocking-comments-ap-govt-39-101874.html





