మిథున్ రెడ్డి నాలుగు వారాల ఊరట.. కోర్టు నుంచి కాదు ఏపీ ప్రభుత్వం నుంచి!
Publish Date:May 13, 2025
Advertisement
ఏపీ లిక్కర్ కుంభకోణంలో వైసీపీ ఎంపీ మథున్ రెడ్డి నిండా ఇరుక్కున్నట్లు కనిపిస్తోంది. ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టుకు రిఫర్ చేసింది. అయితే అరెస్టు నుంచి మాత్రం రక్షణ కల్పించలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం హైకోర్టు మిథున్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలుపై నిర్ణయం తీసుకునే వరకూ అరెస్టు చేయబోమని కోర్టులకు తెలిపి మిథన్ రెడ్డికి ఊరట కలిగించింది. విషయం ఏమిటంటే.. మద్యం కుంభకోణం కేసులో గతంలో హైకోర్టు మిథున్ రెడ్డికి ముందస్తు బెయిలు నిరాకరించింది. దాంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికి మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చకపోవడం.. ఆయనను అరెస్టు చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం కోర్టుకు చెప్పడంతో హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. దీంతో మెరిట్స్ ఆధారంగా మరోసారి మిథున్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలుపై నిర్ణయం తీసుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుకు సూచించింది. అదే సమయంలో గతంలో మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి ఇచ్చిన షీల్డ్ ను తొలగించింది. కానీ బెయిల్ పై హైకోర్టు తీర్పు ఇచ్చేంతవరకూ మిధున్ రెడ్డిని అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో సుప్రీం కోర్టు హైకోర్టుకు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నాలుగు వారాలలోగా విచారణ చేపట్టాలని గడువు విధించింది. అంటే ఏపీ ప్రభుత్వం మిధున్ రెడ్డిని మరో నాలుగు వారాల వరకూ అరెస్టు చేయకుండా భారీ ఊరట కల్పించిందని చెప్పాలి. ఇక ఇప్పుడు మిథున్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలుపై ఏపీ హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారనీ, మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారనీ దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ వరుసగా అరెస్టులు చేస్తుండటంతో మిథున్ రెడ్డి కూడా అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలా ఉండగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీంలో స్వల్ప ఊరట లభించింది. వారి ముందస్తు బెయిలు పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం వరకూ వారిరువురినీ అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
http://www.teluguone.com/news/content/ycp-mp-mithunreddy-gets-respite-from-ap-government-39-197994.html





