ఉద్రిక్తతల వేళ భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్న అందాల పోటీలు
Publish Date:May 13, 2025
Advertisement
ఆపరేషన్ సిందూర్ మొదలైన తర్వాత భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాయాది దేశం పాకిస్తాన్‌తో టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న టైమ్‌లో హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో అందాల పోటీలేంటనే విమర్శలు వెల్లువెత్తాయి. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే.. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం వల్ల మన దేశంపై ఉన్న అభిప్రాయమే మారిపోతుందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా.. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ డబుల్ అవుతుందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో.. అందాల పోటీలు అవసరమా? అనే చర్చ కొన్నాళ్లుగా సాగుతోంది. వాయిదా వేయాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. మిస్ వరల్డ్ పోటీలను పోస్ట్ పోన్ చేయడం పెద్ద పనేం కాదు. దానికి పెద్దగా టైమ్ ఏమీ పట్టదు. మరెందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సమయంలోనూ అందాల పోటీలను ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది? ముందుగా అనుకున్న షెడ్యూల్ డిస్టర్బ్ అవకుండా.. ఎందుకు నిర్వహించాలనుకుంటోంది? అనే కోణంలోనూ చర్చలు మొదలయ్యాయి. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో.. దేశం మొత్తం ఓ ఉద్విగ్న వాతావరణం కొనసాగుతున్న వేళ, హైదరాబాద్‌లో అందాల పోటీలు జరుగుతున్నాయి. అది కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా, మిస్ వరల్డ్ లాంటి ఓ మెగా ఈవెంట్ జరుగుతోందంటే, ఇండియా ప్రశాంతంగానే ఉంది, అంతకుమించి సేఫ్‌గానే ఉందనే మెసేజ్ చాలా బలంగా వెళుతుంది. భారత్‌లో అంతా సేఫ్ అన్న సందేశంమిగతా ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. అందుకే మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోందంట. సరిహద్దుల్లో పాక్ ఎన్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, ఎన్ని రకాలుగా కవ్వింపు చర్యలకు దిగినా, కాల్పుల విరమణకు ఒప్పుకొని,మళ్లీ దానిని ఉల్లంఘించినా, ఈ టెన్షన్స్ అన్నీ బోర్డర్ వరకే పరిమితమయ్యాయన్న విషయం మిస్ వరల్డ్ పోటీలతో మిగతా వరల్డ్‌కు అర్థమవుతుంది. భారత్-పాక్ మధ్య నెలకొన్న టెన్షన్స్ కశ్మీర్ బోర్డర్ వరకే ఉన్నాయి, మిగతా దేశమంతా ప్రశాంతంగానే ఉందనే సందేశం భారత్‌కు ఎంతో ప్లస్ అవుతుందనే చర్చ బలంగా వినిపిస్తోంది. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా, మిస్ వరల్డ్ పోటీలను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తే.. తెలంగాణతో పాటు దేశం బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఇండియా ఎంత సేఫ్‌గా ఉందనే విషయం.. గ్లోబల్ వైడ్‌గా అందరికీ బాగా అర్థమవుతుంది. ఏ అంతర్జాతీయ మీడియాలో భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించిన వార్తలు ప్రసారమవుతున్నాయో.. అదే ఇంటర్నేషనల్ మీడియాలో ఈ మిస్ వరల్డ్ పోటీల కవరేజ్ కూడా వస్తున్నది. దాంతో ఇండియా అంతా కూల్‌గానే ఉందనే మెసేజ్ చాలా బలంగా వెళుతుంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ మిస్ వరల్డ్ పోటీల ఈవెంట్‌కి.. ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా.. పోలీసులు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో డ్రోన్‌లపై నిషేధం విధించింది. పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అందాల భామలు ఉండే హోటళ్ల దగ్గర.. నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 5 వేల మందికి పైగా పోలీసులను.. భద్రత కోసం రంగంలోకి దించారు. గచ్చిబౌలి స్టేడియంతో పాటు సుందరీమణులు బస చేసే హోటళ్ల దగ్గర షార్ప్ షూటర్లను, స్పైపర్లను మోహరించారు. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, క్విక్ రియాక్షన్ టీమ్స్‌ని మోహరించారు. ఇంతటి భద్రత మధ్య మిస్ వరల్డ్ పోటీలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా.. హైదరాబాద్‌లో.. ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌ని ఎంతో సేఫ్‌గా నిర్వహించగలరనే సందేశం వెళుతుంది. గతేడాది తెలంగాణని లక్షన్నర మందికి పైగా.. అంతర్జాతీయ టూరిస్టులు సందర్శించారు. ఈ అందాల పోటీల ద్వారా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
http://www.teluguone.com/news/content/telangana-brand-image-increase-with-miss-world-competetions-39-197996.html





