తండ్రి కడసారి చూపుకోసం వచ్చిన ముద్రగడ కుమార్తెను అడ్డుకున్న వైసీపీయులు.!
Publish Date:Jul 15, 2026
Advertisement
కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు అయితే.. ఆయన స్వగ్రామమైన కీర్లంపూడిలో మాత్రం రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కడసారిగా ముద్రగడ భౌతికకాయాన్ని దర్శించుకుని నివాళులు అర్పించేందుకు వచ్చిన ఆయన కుమార్తె క్రాంతిని, వైసీపీకి చెందిన కొందరు అడ్డుకోవడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. అంత్యక్రియల సమయంలో ఆయన కుమార్తెను అడ్డుకోవడం పట్ల స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా తండ్రి ముద్రగడ పద్మనాభం, కుమార్తె క్రాంతి మధ్య రాజకీయపరంగా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ముద్రగడ వైసీపీలో క్రియాశీలకంగా కొనసాగగా, ఆయన కుమార్తె క్రాంతి మాత్రం జనసేన కండువా కప్పుకుని ఆ పార్టీ తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలో గతంలో తండ్రి వైఖరిపై ఆమె బహిరంగంగానే విమర్శలు గుప్పించడంతో వీరిద్దరి మధ్య రాజకీయ విభేదాలు పీక్స్ కు చేరాయి. తండ్రి మరణవార్త తెలియగానే ఆమె కుమార్తె క్రాంతి.. తండ్రి కడసారి చూపు కోసం కీర్లంపూడిలోని నివాసానికి చేరుకోగానే అక్కడున్న వైసీపీ మద్దతుదారులు ఆమె లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. క్రాంతికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గతంలో తండ్రి రాజకీయ విధానాలను, ముద్రగడను తీవ్రంగా విమర్శించిన క్రాంతికి, ఇప్పుడు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించే నైతిక అర్హత లేదని వారు వాదించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కీర్లంపూడిలోని ముద్రగడ నివాసం ప్రాంగణం నిరసనలకు వేదికైంది. కడసారి చూపు కోసం వచ్చిన కుమార్తెను అడ్డుకోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, ఒక బిడ్డగా తండ్రికి చివరిసారిగా వీడ్కోలు పలికే హక్కు ఆమెకు ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరసనకారులను పక్కకు నెట్టివేస్తూ, క్రాంతికి రక్షణ కల్పించారు. పోలీసు బలగాల పర్యవేక్షణలో ఆమెను సురక్షితంగా ముద్రగడ భౌతికకాయం ఉంచిన ప్రదేశానికి తీసుకెళ్లారు. తీవ్ర భావోద్వేగానికి గురైన క్రాంతి, కన్నీటి పర్యంతమవుతూ తన తండ్రికి చివరి నివాళులర్పించారు. గతంలో ముద్రగడ అనారోగ్య సమస్యలపై క్రాంతి చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి. తన తండ్రి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని, ఇంట్లో ఆయనకు సక్రమమైన సంరక్షణ జరగడం లేదని ఆమె ఆరోపించగా, ముద్రగడ ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ అంశాలు సైతం రాజకీయ రంగు పులుముకోవడంతో తండ్రీకూతుళ్ల నడుమ దూరం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ముద్రగడ మరణాంతరం కూడా ఆయన మద్దతుదారులు ఆ పాత పగలను, రాజకీయ వైరాన్ని మనసులో ఉంచుకుని క్రాంతి పట్ల నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై అటు జనసేన, ఇటు వైఎస్సార్సీపీ శ్రేణులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత విషాదకరమైన అంత్యక్రియల సమయంలో ఇలాంటి రాజకీయ ఘర్షణలకు తావు ఇవ్వడం సరికాదని పరిశీలకులు అంటున్నారు. Mudragada Padmanabham Death Kirlampudi, Andhra Pradesh Kapu Leader Mudragada, YSRCP Janasena Political Dispute Mudragada
http://www.teluguone.com/news/content/ycp-members-obstructed-mudragadas-daughter-36-226026.html





