ఒంగోలు కార్పొరేషన్ తెలుగుదేశం వశం
Publish Date:Aug 14, 2024
Advertisement
తెలుగువన్ చెప్పిందే నిజమైంది. ఒంగోలు కార్పొరేషన్ తెలుగుదేశం వశమైంది. ఇటీవలి ఎన్నికలలో ఓటమి తరువాత నుంచీ వైసీపీకి ఒకదాని వెంట ఒకటిగా కష్టాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీకి స్థానిక సంస్థలపై కూడా పట్టు లేకుండా పోతోంది. పలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో వైసీపీ బలహీనం అవుతోంది. పంచాయతీలలో కూడా ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. తాజాగా ఒంగోలు కార్పొరేషన్ ను వైసీపీ కోల్పోయింది. ఇటీవలి సాధారణ ఎన్నికలకు ముందే ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం గూటికి చేరారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విజయం వైసీపీకి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఇటీవలి ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్ధన్ విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే బాలినేని ఓటమి తరువాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకపోవడం, క్యాడర్ ను పట్టించుకోకపోవడంతో వైసీపీ నేతల పరిస్థితి అగమ్యగోచరమైంది. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. గతంలోనే కొందరు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరగా, తాజాగా మేయర్ సుజాత సహా 12 మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే దామచర్ల సమక్షంలో సైకిలెక్కేశారు. దీంతో ఒంగోలు కార్పొరేషన్ తెలుగుదేశం వశం అయ్యింది.
http://www.teluguone.com/news/content/ycp-loses-ongole-corporation-25-182965.html





